
చైనాతో భారత మహిళల హాకీ పోరు నేడు
ఓడితే ప్రొ లీగ్ నుంచి టీమిండియా అవుట్
బెర్లిన్: పరాజయాల పరంపరకు బ్రేక్ వేయడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు చైనాతో పోరుకు సిద్ధమైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో అమ్మాయిల జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయిన భారత్ ఎలాగైన చైనాపై జరిగే పోరులో గెలవాలనుకుంటుంది. ఈ మ్యాచ్ కూడా ఓడితే సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమవుతుంది. మొత్తం 9 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన మహిళల జట్టు 10 పాయింట్లతో అట్టడుగున ఉంది.
ప్రొ లీగ్ నిబంధనల ప్రకారం అట్టడుగున నిలిచిన జట్టు ప్రస్తుత లీగ్‌లో చోటు కోల్పోతుంది. మళ్లీ ప్రొ లీగ్‌లో స్థానం కోసం ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌లో ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి దుస్థితి నుంచి తప్పించుకోవాలంటే భారత్... చైనాపై గెలిచి తీరాలి. అప్పుడు అథమ స్థానం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ కూడా తమ జట్టు ఈ యూరోపియన్ అంచెలో బోణీ చేయాలని గట్టిగా ఆశిస్తున్నాడు. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన ప్రొ లీగ్‌లో రాణించిన జట్టు యూరోపియన్ అంచెకు వచ్చేసరికి చతికిలబడటం అనూహ్య పరిణామం.
ఆ్రస్టేలియా, అర్జెంటీనా, బెల్జియంలతో జరిగిన రెండేసి మ్యాచ్‌ల్లో... మొత్తం ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం కోచ్ హరేంద్రకు ఏమాత్రం రుచించడం లేదు. కెపె్టన్ సలిమా టెటె ఈ డబుల్ హెడర్ (చైనాతో రెండు మ్యాచ్‌లు) కీలకమని చెప్పింది. భారత పురుషుల జట్టులాగే ఆఖర్లో బెల్జియంపై గెలిచినట్లే తాము కూడా చైనాపై గెలుస్తామని పేర్కొంది. చైనాతో చివరి సారిగా ఆడిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు పైచేయి సాధించింది.
గత నవంబర్‌లో బిహార్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో 3–0తో గెలిచిన అమ్మాయిల జట్టు... ఫైనల్లో 1–0తో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ సానుకూల పరిస్థితుల్నే అనుకూలంగా మలచుకొని విజయం సాధించాలనే పట్టుదలతో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది.