నేడు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్‌తో బరోడా ‘ఢీ’
గాయం నుంచి కోలుకున్న పాండ్యా
ఉదయం 11 గంటల నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో బరోడా తరఫున హార్దిక్ ఆడనున్నాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో గాయపడిన హార్దిక్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.
సెప్టెంబర్ 26న అతను చివరిసారిగా మ్యాచ్ (శ్రీలంకతో) ఆడాడు. ఈ మ్యాచ్‌లో కండరాల గాయంతో తప్పుకున్న పాండ్యా కొంత విశ్రాంతి తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు చేరుకున్నాడు. అక్టోబర్ 15 నుంచి మధ్యలో మూడు రోజుల దీపావళి సెలవు మినహా నవంబర్ 29 వరకు అక్కడే ఉండి పూర్తిగా కోలుకునే వరకు రీహాబిలిటేషన్ కొనసాగించాడు. మ్యాచ్ ఆడేందుకు పాండ్యా సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
హార్దిక్ ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేసేందుకు మ్యాచ్ ఫిట్‌గా మారాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) సర్టిఫికెట్ ఇచ్చింది. ‘దాదాపు నలభై రోజుల పాటు సీఓఈ బయటకు కూడా పోకుండా పాండ్యా పూర్తి స్థాయి రీహాబిలిటేషన్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్స్‌ను అన్ని విధాలా పాటించాడు. ఇప్పుడు మ్యాచ్ ఆడటమే మిగిలింది’ అని సీఓఈ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ప్రజ్ఞాన్ ఓజా సమక్షంలో...
నిజానికి ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాండ్యా డిసెంబర్ 4న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. అయితే బీసీసీఐ సెలక్టర్, హైదరాబాద్‌కే చెందిన ప్రజ్ఞాన్ ఓజా ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కనీసం రెండు మ్యాచ్‌లలో హార్దిక్ ఆట, ఫిట్‌నెస్‌ను పరీక్షించాలని సెలక్టర్లు భావించారు. దాంతో నేడు, గురువారం జరిగే రెండు మ్యాచ్‌లు హార్దిక్ ఆడతాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో అతని ప్రదర్శన కీలకం కానుంది.
అభిషేక్ మళ్లీ చెలరేగేనా!
భారత ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సభ్యుడు అభిషేక్ శర్మ మరోసారి తన టి20 మెరుపులను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం జింఖానా మైదానంలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 16 సిక్స్‌లతో 148 పరుగులు బాదిన అభిషేక్ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. గత పోరులో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్న అతను 32 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్, కెపె్టన్ కృనాల్ పాండ్యా మినహా పెద్ద అనుభవం లేని బరోడా బౌలింగ్ అతడిని ఏమాత్రం నిలువరించగలదో చూడాలి.


