
దేశీ విమానయాన కంపెనీ ఆకాశ ఎయిర్ (Akasa Air) అంతర్జాతీయ కార్యకలాపాల సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, సహవ్యవస్థాపకురాలు నీలూ ఖత్రి రాజీనామా చేశారు. తద్వారా మూడేళ్ల క్రితమే ఏర్పాటైన కంపెనీ నుంచి నిష్క్రమించారు. ప్రొఫెషనల్‌గా కొత్త దారిలో ప్రయాణించేందుకు వీలుగా నీలూ ఖత్రి (Neelu Khatri) పదవిని వొదులుకున్నట్లు ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.
2022 ఆగస్ట్ 7న కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన ఖత్రి ఆకాశ ఎయిర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలోనూ ఒకరిగా సేవలు అందిస్తున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు వినయ్ దూబే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంపెనీ సహవ్యవస్థాపకుల జాబితాలో ఆదిత్య ఘోష్, ఆనంద్ శ్రీనివాసన్, బెల్సన్ కౌటినో, భవిన్ జోషీ, ప్రవీణ్ అయ్యర్ సైతం ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కొంతమంది కంపెనీ నుంచి వైదొలగడం గమనార్హం! మరోపక్క ఆగస్ట్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించిన విషయం విదితమే.
ఇదీ చదవండి: ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితా: టాప్ 10లో ఒక్క మహిళ