ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్‌ఝన్ వాలా తీసుకొచ్చిన విమానయాన సంస్థ ఆకాశా ఎయిర్‌పై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపాయి. ఆకాసా ఎయిర్ విమానంలో పరిశుభ్రత లేక తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఒక మహిళ ఆరోపించింది. దీనిపై సంస్థ ఆకాశ ఎయిర్ స్పందించింది.
జాహ్నవి త్రిపాఠి అనే మహిళ లింక్డిన్ ద్వారా తన అనుభవాన్ని పంచుకుంది. విమానంలోని అపరిశుభ్ర వాతావరణం తనను తీవ్ర అనారోగ్యం పాలుచేసిందినీ, తనతోపాటు ప్రయాణిస్తున్న తన స్నేహితులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆమె ఆరోపించించింది.
తన స్నేహితులతో కలిసి జాహ్నవి బెంగళూరు-అహ్మదాబాద్‌కు డిసెంబర్ 26న రాత్రి 10:25 గంటలకు ఆకాశఎయిర్ విమానంలో బయలుదేరారు. విమానంలోని క్యాబిన్, సీట్ల పరిస్థితి చూసి షాక్ అయ్యామని, ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే కాళ్లపై తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని, అది కాలక్రమేణా మరింత తీవ్రమైందని త్రిపాఠి ఆరోపించింది. దీంతో నడవలేక, నిద్రపట్టక, రోజువారీ పనులు చేసుకోలేక ఇబ్బందు లుపడ్డానని చెప్పుకొచ్చింది. మొత్తం ప్రయాణమంతా దుర్బరమని పేర్కొంది. తనతోపాటు తన స్నేహితులు కూడా బాధలు పడ్డారని తన పోస్ట్‌లో పేర్కొంది.ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, ఈ ప్రయాణం తనను శారీరకంగా, మానసికంగా కృంగదీసిందని తెలిపింది. ప్రయాణీకుల ఆరోగ్యం, భద్రత అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని వ్యాఖ్యానించింది.
ఆకాశ ఎయిర్ స్పందన
ఈ ఆరోపణలపై స్పందించిన ఆకాశ ఎయిర్ ఆమె ఇబ్బందులపై విచారం ప్రకటించింది. అత్యున్నత పరిశుభ్రత, కస్టమర్ శ్రేయస్సే తమ లక్ష్యమని, ఫిర్యాదును పరిశీలించి, వీలైనంత త్వరగా సంప్రదిస్తామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.


