బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన అఫ్గన్‌.. నబీ విధ్వంసం, బిలాల్‌ విజృంభణతో.. | Afghanistan Beat Bangladesh By 200 Runs In 3rd ODI Clean Sweep, Check Out Score Details And Viral Videos | Sakshi
Sakshi News home page

AFG Vs BAN: బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన అఫ్గన్‌.. నబీ విధ్వంసం, బిలాల్‌ విజృంభణతో..

Oct 15 2025 9:55 AM | Updated on Oct 15 2025 10:17 AM

Afghanistan beat Bangladesh By 200 Runs in 3rd ODI Clean Sweep

బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన అఫ్గన్‌ (PC: ACB)

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన అఫ్గనిస్తాన్‌ (AFG vs BAN).. వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాను 3-0తో వైట్‌వాష్‌ చేసి సరైన సమాధానం ఇచ్చింది. అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఆఖరి వన్డేలో సంచలన ప్రదర్శనతో అఫ్గన్‌ ఈ మేరకు విజయం సాధించడం విశేషం.

నబీ విధ్వంసకర ఇన్నింగ్స్‌
షేక్‌ జాయేద్‌ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్‌ 42 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఇబ్రహీం జద్రాన్‌ ఐదు పరుగుల తేడాతో (95) సెంచరీ మిస్సయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సెదీకుల్లా అటల్‌ (47 బంతుల్లో 29) పెద్దగా ఆకట్టుకోకపోగా..కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది (2), వికెట్‌ కీపర్‌బ్యాటర్‌ ఇక్రామ్‌ అలిఖిల్‌ (2) పూర్తిగా విఫలమయ్యారు.

ఆల్‌రౌండర్‌అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వెటరన్‌ స్టార్‌ మహ్మద్‌ నబీ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి అఫ్గన్‌ 293 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.

బంగ్లా బౌలర్లలో సైఫ్‌ హసన్‌ మూడు వికెట్లు తీయగా.. హసన్‌ మహమూద్‌, తన్వీర్‌ ఇస్లాం చెరో రెండు, కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు అఫ్గన్‌ బౌలర్లు చుక్కలు చూపించారు.

పెవిలియన్‌కు క్యూ కట్టిన బంగ్లా బ్యాటర్లు
బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ 43 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన వాళ్ల స్కోర్లు వరుసగా 7, 3, 7, 6, 0, 2, 4, 5 9 2*. మహ్మద్‌ నయీమ్‌, నజ్ముల్‌ హుసేన్‌ షాంటో, తౌహీద్‌ హృదోయ్‌, మెహదీ హసన్‌ మిరాజ్‌, షమీమ్‌ హొసేన్‌, నూరుల్‌ హసన్‌, రిషాద్‌ హొసేన్‌, తన్వీర్‌ ఇస్లాం, హసన్‌ మహమూద్‌, నషీద్‌ రాణా (వరుసగా) ఈ మేరకు చెత్త ప్రదర్శన కనబరిచారు.

93 పరుగులకే ఆలౌట్‌
బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో బంగ్లా 27.1 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్‌ అయింది. అఫ్గన్‌ బౌలర్లలో బిలాల్‌ సమీ ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. రషీద్‌ ఖాన్‌ 6 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చడం గమనార్హం. మిగతావారిలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

ఇదే అత్యంత పెద్ద విజయం
బౌలర్ల విజృంభణ కారణంగా అఫ్గనిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై ఏకంగా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా పరుగుల పరంగా అబుదాబి వేదికగా ఇదే అత్యంత పెద్ద విజయం కావడం గమనార్హం. ఇక బిలాల్‌ సమీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కగా.. ఇబ్రహీం జద్రాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.

చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్‌ ఫైర్‌.. బీసీసీఐ స్పందన ఇదే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement