
సౌతాఫ్రికా సీనియర్ జట్టు
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఈ ఏడాది నవంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. నవంబర్ 14న కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో సౌతాఫ్రికా జట్టు ఇండియా పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా-ఎ జట్టు కూడా భారత్‌కు రానుంది.
రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా-ఎ జట్టును ప్రోటీస్-ఎ జట్టు ఢీకొట్టనుంది. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా-ఎ జట్టు పర్యటన ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల అనాధికారిక టెస్టు సిరీస్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరగనుండగా.. మూడు వన్డేలకు సిరీస్‌కు రాజ్‌కోట్ ఆతిథ్యమివ్వనుంది.
ఈ క్రమంలో భారత్ టూర్‌కు సౌతాఫ్రికా-ఎ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు సిరీస్‌లలోనూ ప్రోటీస్ జట్టు కెప్టెన్‌గా మార్క్వెస్ జానీ అకెర్‌మాన్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా సౌతాఫ్రికా సీనియర్ జట్టు కెప్టెన్ టెంబా బావుమా కూడా ఈ జట్టులో ఉన్నాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్‌లో గాయపడిన బావుమా.. అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఓ వైపు గాయంతో పోరాడుతూనే.. 27 సంవత్సరాల తర్వాత తన జట్టుకు తొలి ఐసీసీ టైటిల్‌ను అందించాడు. గాయం కారణంగా పాకిస్తాన్ టూర్‌కు బావుమా దూరమయ్యాడు.
అతడి స్ధానంలో ఐడైన్ మార్‌క్రమ్ సఫారీలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌కు ముందు తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని టెంబా పట్టుదలతో ఉన్నాడు. ఇండియా-ఎతో జరిగే రెండో టెస్టులో అతడు ఆడనున్నాడు. తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అనధికారిక టెస్టుల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్‌మాన్, టెంబా బావుమా*, ఓకుహ్లే సెలె, జుబేర్ హంజా, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్‌సామి, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, లెసెగో సెనోక్వానే, లెసెగో సెనోక్వానే, ప్రెనెలన్ సుబ్రాయెన్, కైల్ సిమ్మండ్స్, త్సెపో ద్వాండ్వా, జాసన్ స్మిత్, టియాన్ వాన్ వురెన్, కోడి యూసుఫ్.
వన్డేల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్‌మాన్, ఒట్నీల్ బార్ట్‌మన్, బ్జోర్న్ ఫోర్టుయిన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్‌సామి, త్షెపో మోరెకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, డెలానో పోట్‌గీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబ క్యూషీలే, జాసన్ స్మిత్, కోడి యూసుఫ్.
చదవండి: హైదరాబాద్‌లో మెరుపులు.. ఇద్దరు డబుల్ సెంచరీలు.. ఏకంగా 529 రన్స్