
నెట్స్‌లో శ్రమించిన కోహ్లి, రోహిత్
పెర్త్: దాదాపు ఏడాది క్రితం పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి అజేయ సెంచరీ సాధించాడు. అదే అతని టెస్టు కెరీర్‌లో చివరి సెంచరీ అయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానానికి వచ్చిన కోహ్లి కొత్త ఉత్సాహంతో కనిపించాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా అతను గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతున్న కోహ్లి సాధనలో బాగా చురుగ్గా పాల్గొన్నాడు.
ముందుగా 20 నిమిషాల పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన అతను ఆ తర్వాత 40 నిమిషాలు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. హర్షిత్ రాణా, అర్‡్షదీప్ సింగ్‌లతో పాటు స్థానిక ఆటగాళ్లు బౌలింగ్ చేయగా... ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లు ఆడాడు. అతని పక్క నెట్స్‌లోనే మరో స్టార్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.
ఆరంభంలోనే కొద్దిసేపు రోహిత్ తన ఫుట్‌వర్క్, టైమింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కుదురుకున్న తర్వాత అతనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో రోహిత్ చాలాసేపు చర్చించడం కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి కోహ్లి, రోహిత్‌ల వ్యవహార శైలి చాలా ఆసక్తికరంగా కనిపించింది.
నెట్స్ వద్దకు అనుమతించిన అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వీరిద్దరు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సమయం గడపడం విశేషం. ఈ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం ఆప్షనల్ ప్రాక్టీస్ డే కాగా... భారత్ నుంచి రెండో బృందంలో వచ్చిన సిరాజ్, కుల్దీప్, అక్షర్ తదితరులు సాధనకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జాయ్ రిచర్డ్సన్ కూడా నెట్స్‌లో సాధన చేశారు.