వాషింగ్టన్: భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వేళ అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు కురిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్.. భారత్, ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు, ఈ ఒప్పందం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఈయూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. భారత్‌తో వాణిజ్యం విషయంలో ఈయూ నిర్ణయం పట్ల నిరాశ చెందాను. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని అన్ని ఒప్పందాలకు తల్లిగా ప్రశంసించారు. కానీ, వారు తమకు ఏది ఉత్తమమో అది చేయాలి. భారత్‌పై అమెరికా సుంకాలను విధించడాన్ని ఈయూ ఇష్టపడటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ.. ఏం జరిగిందో చూశారా? యురోపియన్లు భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.
అమెరికాలాగే భారత్‌పై అదనపు సుంకాలు విధించేందుకు ఈయూ విముఖత వ్యక్తం చేసిందన్నారు. సొంత వాణిజ్య ఒప్పందానికి ముందుకు వెళ్తున్నందునే.. వారు ఆ పని చేసేందుకు ఇష్టపడలేదన్నారు. ఐరోపా ఉక్రెయిన్ ప్రజల కంటే వాణిజ్య ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రష్యన్ చమురు తొలుత భారత్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని ఐరోపావాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.
Bessent: "I find the Europeans very disappointing because the Europeans are on the frontline of the Ukraine-Russia war. India started buying sanctioned Russian oil and guess who was buying the refined products? The Europeans. So the Europeans have been funding the war against… pic.twitter.com/QSkcdYL7QL
— Aaron Rupar (@atrupar) January 28, 2026
అంతకుముందు కూడా బెసెంట్.. భారత్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ‘రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను’ అని సుంకాల తొలగింపు గురించి పరోక్షంగా వెల్లడించారు.


