టెహ్రాన్: ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రాణాలతో ఉన్నారా, లేరా? ఉంటే ఎందుకు బయిటకి రావడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కీలక ప్రకటన చేసింది. బెంజిమిన్ నెతన్యాహు బ్రతికే ఉంటే ఎట్టిపరిస్థితుల్లో ఆయనను చంపి తీరుతామని హెచ్చరించింది.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం నెతన్యాహు క్షేమంగా ఉన్నారా లేరా అనుమానాలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ఆయన ప్రసంగంతో ఒక వీడియో వచ్చినా అది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ పలువురు కొట్టిపడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటనలో " పిల్లలను చంపిన నేరస్థుడు బతికి ఉన్నాడో లేరో తెలియదు ఒక వేళ బతికి ఉంటే మేము పూర్తి శక్తితో అతనిని వెంటాడి చంపేస్తాము" అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్‌లోని ఓ బాలికల పాఠశాలపై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 180 కిపైగా అభం శుభం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ దాడి అనుకోకుండా జరిగిందని అమెరికా చెబుతుండగా తెలిసే చేశారని ఇరాన్ అంటుంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహుని పిల్లలను చంపే నేరస్థుడు అని ఇరాన్ పిలుస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీని అంతం చేసిన ఇజ్రాయెల్ తదుపరి ఆ బాధ్యతలు స్వీకరించిన మోజ్తాబా ఖమేనీపైన దాడి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలను లేపేస్తాం అని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో దాదాపు రెండువేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.


