టీమిండియాతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. విశాఖపట్నంలో బుధవారం జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ సేనను 50 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా భారత్ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది.
టీమిండియా మాదిరే
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్పందించాడు. ‘‘మా ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో మా వాళ్లు అద్భుతం. టీమిండియా మాదిరే మా ఆటగాళ్లు కూడా పవర్‌ప్లేలో కావాల్సినన్ని పరుగులు రాబట్టారు.
అందుకే మేము మెరుగైన స్కోరు సాధించాము. టీమిండియా లాంటి జట్టుకు 200 మేర లక్ష్యం ఎంతమాత్రం మాకు సురక్షితం కాదు. వాళ్లు సులువుగానే ఈ టార్గెట్‌ను ఛేదించగలరు. గత మ్యాచ్‌లో మాకు ఈ విషయం చాలా బాగా అర్థమైంది.
అద్భుతమైన ఫినిషింగ్ టచ్
మధ్య ఓవర్లలో మేము వికెట్లు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగించింది. అయితే, డారిల్ మిచెల్, ఫౌల్క్స్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. భారత్‌లో వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియాతో ఆడటం కంటే గొప్ప సన్నాహకం ఇంకేం ఉంటుంది. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి.
మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించాము. వరల్డ్‌కప్ టోర్నీలో ఎవరి పాత్ర ఎలా ఉండాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాము. పవర్ ప్లేలో వికెట్లు తీయడం మాకు కలిసి వచ్చింది’’ అని సాంట్నర్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.
ఫిబ్రవరి 7 నుంచి..
కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
నామమాత్రపు నాలుగో టీ20లో మాత్రం కివీస్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఊరట దక్కే విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ నాలుగో టీ20 స్కోర్లు
న్యూజిలాండ్-215/7(20)
టీమిండియా- 165(18.4)
ఫలితం: యాభై పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62).
చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన


