పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ పిలుపు
విమాన తయారీ, పైలట్ శిక్షణ, విమాన లీజింగ్‌లో భారీగా అవకాశాలు
ప్రతీ పౌరుడు సులభంగా విమానయానం చేసేలా చర్యలు
ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ, సీ–ప్లేన్స్ కోసం తదుపరి ‘ఉడాన్ స్కీమ్’
ఇప్పటికే దేశీయంగా మిలటరీ విమానాల ఉత్పత్తి... ఇక పౌర విమానాల తయారీవైపు అడుగులు
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరణ
‘వింగ్స్ ఇండియా–2026’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని
సాక్షి, హైదరాబాద్: భారత విమానయాన రంగం గత దశాబ్ద కాలంలో చరిత్రాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఒకప్పుడు దేశంలో విమానయానం కొద్దిమందికే పరిమితం కాగా.. నేడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఎదిగిందని చెప్పారు. విమాన తయారీ, పైలట్ శిక్షణ, అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ, విమాన లీజింగ్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని.. వీటిని పరిశ్రమల అధిపతులు, పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మొత్తానికి భారత విమానయాన రంగానికి కోపైలట్‌గా ఉండాలని చెప్పారు. రాబోయే కాలంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగి పెట్టుబడులకు విస్తృత అవకాశాలు దొరుకుతాయన్నారు. బుధవారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2026’ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.
గత పదేళ్లలో దేశీయ విమానయాన రంగం అసాధారణ అభివృద్ధి సాధించిందని, ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. ఇటీవలి సంవత్సరాల్లో భారతీయ విమానయాన సంస్థలు 1,500కు పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల భాగస్వాములకు వింగ్స్ ఇండియా సదస్సు ఎంతో కీలకమన్నారు.
రెండో దశ ‘ఉడాన్’ స్కీమ్’
విమాన ప్రయాణాన్ని ప్రత్యేక హక్కుగా కాకుండా ప్రతి పౌరుడికి అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేశామని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో దేశంలో కేవలం 70 విమానాశ్రయాలే ఉండగా, ప్రస్తుతం అవి 160కిపైగా చేరాయని, పదేళ్లలోనే రెట్టింపు కంటే ఎక్కువ విమానాశ్రయాలు నిర్మించినట్లు తెలిపారు. ప్రాంతీయ, ఎయిర్ కనెక్టివిటీ, స్లీ–ప్లేన్ ఆపరేషన్స్ కోసం రెండో దశ ‘ఉడాన్ స్కీమ్’ ఉంటుందన్నారు.
ప్రతీ పౌరుడు సులభంగా విమానయానం చేసేందుకు వీలైన చర్యల్లో భాగంగా సరసమైన విమాన చార్జీల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఉడాన్ పథకం ద్వారా ఇప్పటివరకు కోటిన్నర మంది ప్రయాణికులు, గతంలో లేని మార్గాల్లో కూడా ప్రయాణించారని తెలిపారు. 2047 నాటికి దేశంలో 400కు పైగా విమానాశ్రయాలు ఉండనున్నాయని, అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ ముందుకెళ్తున్నందున విమాన అనుసంధాన విస్తరణ మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు.
పర్యాటక రంగంపైనా దృష్టి
దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ, ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోందని ప్రధాని మోదీ చెప్పారు. విమాన డిజైన్, తయారీ, మరమ్మతులు–నిర్వహణ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. భారత్ ఇప్పటికే విమాన భాగాల తయారీలో కీలక దేశంగా మారిందని, దేశీయంగానే సైనిక, రవాణా విమానాలను ఉత్పత్తి చేస్తోందని చెప్పారు.
పౌర విమానాల తయారీ దిశగానూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. భౌగోళికంగా భారత్‌కు ఉన్న వ్యూహాత్మక స్థానం, విస్తృత దేశీయ అనుసంధాన వ్యవస్థ, భవిష్యత్తులో పెద్దఎత్తున విమాన సేవల విస్తరణ భారత్‌కు పెద్ద బలమని పేర్కొన్నారు. భారత్‌లో రూపొందించి తయారుచేసిన ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటీవోఎల్) విమానాలు త్వరలోనే దేశీయ విమానయాన రంగాన్ని మార్చబోతున్నాయని, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని చెప్పారు.
గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ
సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్‌పై భారత్ గట్టిగా పని చేస్తోందని, భవిష్యత్తులో గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీ, ఎగుమతుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. విమానయాన రంగంలో సంస్కరణల వల్ల భారత్ గ్లోబల్ సౌత్‌కు, ప్రపంచానికి మధ్య ప్రధాన విమాన ద్వారంగా మారుతోందని చెప్పారు. పెట్టుబడిదారులు, తయారీదారులకు ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
విమానయానంతో పాటు ఎయిర్ కార్గో రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కార్గో రవాణా వేగవంతం, సులభతరం చేయడానికి సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. భారత్ త్వరలో అంతర్జాతీయ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా మారుతుందని, గిడ్డంగులు, ఫ్రైట్ ఫార్వర్డింగ్, ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్, ఈ–కామర్స్ రంగాల్లో అవకాశాలను పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


