స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఆయుష్ వైద్యులకు లబ్ధి
ఆయుర్వేదం, యోగా నేర్చుకున్న యువతకు చక్కటి ఆదాయం
‘ఆర్య వైద్యశాల’శత వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: చరిత్రాత్మక ఇండియా–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారతీయ ప్రాచీన సంప్రదాయ వైద్య సేవలు అందించేవారు విశేషంగా ప్రయోజనం పొందుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన ఆయుష్ వైద్యులు ఇకపై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోనూ వైద్య చికిత్సలు, సేవలు అందించవచ్చని తెలిపారు. వారికి అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మనదేశంలో ఆర్జించిన వైద్య అర్హతలతో యూరప్ దేశాల్లో పని చేయవచ్చని సూచించారు.
ఆయుర్వేదం, యోగా వంటివి నేర్చుకున్న యువతకు చక్కటి ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. కేరళలోని ఆర్య వైద్యశాల చారిటబుల్ హాస్పిటల్ శత వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈయూతో కుదిరిన ఒప్పందాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ సంప్రదాయ వైద్య సేవలకు, వైద్యులకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు.
యూరప్ దేశాల్లో వెల్‌నెస్ కేంద్రాలు
ఈయూతో ఒప్పందంలో భాగంగా యూరప్ దేశాల్లో ఆయుష్ వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చని ప్రధానమంత్రి వివరించారు. మన సంప్రదాయ ఆయుర్వేద, ఆయుష్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. శతాబ్దాలపాటు ఆయుర్వేదంతో భారతీయులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. కానీ, దురదృష్టవశాత్తూ నేడు ఆయుర్వేదం గురించి మన దేశంలోనే ప్రజలకు పూర్తిగా తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆయర్వేదం ప్రాముఖ్యతను దేశ విదేశాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం వచి్చందని ఉద్ఘాటించారు. సాక్ష్యాల ఆధారిత పరిశోధనలు, పరిశోధన పత్రాల అందుబాటులో లేకపోవడం వల్లే ఆయుర్వేదం గురించి ప్రజలకు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు.
600కుపైగా ఔషధాల తయారీ
సైన్స్, ప్రజల విశ్వాసం ఆధారంగా ఆయుర్వే ద విధానాలను పరీక్షిస్తే అవి బలోపేతం అవుతాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయర్వేదానికి ప్రాముఖ్యత లభించేలా ఆర్య వైద్యశాల కృషి చేస్తోందని ప్రశంసించారు. సీఎస్‌ఐఆర్, ఐఐటీ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. దీనిపై ఎన్నో పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానాలను పరిరక్షించడంలో, మరింత అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందని వివరించారు. ఆర్య వైద్యశాల వ్యవస్థాపకుడు వైద్య రత్నం పి.ఎస్.వారియర్ అందించిన సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా గుర్తుచేశారు. శతాబ్దాలుగా మానవళికి భారత్ అందిస్తున్న సేవలకు, సంప్రదాయ వైద్యానిక ఆర్య వైద్యశాల ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఆర్య వైద్యశాల 600కుపైగా ఔషధాలు తయారు చేస్తోందని, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను నిర్వహిస్తోందని వెల్లడించారు. విదేశాల నుంచి సైతం రోగులు వస్తుంటారని తెలిపారు.


