వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ
సోమ, మంగళవారాల్లో గుజరాత్‌కు
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలతో వస్తున్న మరో రెండు భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. భారీస్థాయిలో ఎల్పీజీ నిల్వలతో భారత్ వైపు బయల్దేరాయి. ‘‘శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు శనివారం ఉదయం హార్మూజ్‌ను దాటుకుని వచ్చాయి. గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా రేవులకేసి బయల్దేరాయి’’అని నౌకాయాన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. వాటిలో 92,700 టన్నుల ఎల్పీజీ ఉన్నట్టు వెల్లడించారు. శివాలిక్ సోమవారం ముంద్రాకు, ఆ మర్నాడు నందాదేవి కాండ్లాకు చేరే అవకాశముందన్నారు. హార్మూజ్‌కు పశి్చమాన మరో 22, తూర్పున 4 భారత నౌకలు ఇంకా వెయిటింగ్‌లోనే ఉన్నట్టు ఆయన వివరించారు.
వాటిని కూడా సురక్షితంగా దాటించేలా ఇరాన్ వర్గాలతో కేంద్రం ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. పశి్చమాన నిలిచిన 22 నౌకల్లో ఆరింట్లో ఎల్పీజీ, ఒకదాంట్లో ఎల్‌ఎన్‌జీ, నాలుగింట్లో చమురు నిల్వలున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఎలీ్పజీకి తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో రెండు నౌకల్లో భారీగా నిల్వల రాక ఉపశమనం కల్పించనుంది. టాంజానియాకు గ్యాసోలిన్ నిల్వలు తీసుకెళ్తున్న జగ్‌ప్రకాశ్ అనే భారత చమురు నౌక శుక్రవారమే హార్మూజ్‌ను దాటడం తెలిసిందే. మన దేశీయ ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. వాటిలో 90 శాతం దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచే జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి హార్మూజ్ మూతపడటంతో గల్ఫ్ నుంచి చమురు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోయాయి.
మళ్లీ రష్యా నుంచే కొనాలని అడుక్కుంటోంది
ఇరాన్ ఎద్దేవా
దుబాయ్: రష్యా నుంచి ముడిచమురు కొనొద్దని భారత్‌ను నెలల తరబడి బెదిరించిన అమెరికా ఇప్పుడు గతిలేక భారత్‌ను బతిమిలాడుతోందని ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం మొదలుకాకమునుపేమో రష్యా నుంచి చమురు అస్సలు కొనకూడదని భారత్‌ను అమెరికా బాగా బెదిరించింది. తీరా యుద్ధం మొదలయ్యాక మార్చి ఐదో తేదీన అమెరికా మాటమార్చింది. యుద్ధం దెబ్బకు హార్మూజ్ మూతబడటంతో రష్యాకాకుండా ఇతర దేశాల నుంచి చమురు కొనాలంటే సాధ్యపడట్లేదు. అందుకే మరో 30 రోజుల సడలింపు ఇస్తున్నాం.. రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా భారత్‌కు అడగకపోయినా గడువు పెంచుతూపోతోంది’’అని అబ్బాస్ వెటకారంగా మాట్లాడారు.


