పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి! | Beaten By Husband, Woman Escapes Walks To Police With Chain On Neck, More Details Inside | Sakshi
Sakshi News home page

పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

Jun 15 2026 2:32 PM | Updated on Jun 18 2026 10:52 AM

beaten by husband Woman escapes walks to police with chain on neck

కట్టుకున్న భర్త వేధింపులకు గురిచేసి, అత్యంత  దారుణంగా హింసించిన  కేసు ఒకటి కలకలం రేపుతోంది. ఎర్రగా కాలిన ఇనుప రాడ్‌తో వాతలు పెట్టి  హింసించాడు. మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతనైతే పోలీసుల దగ్గరకు వెళ్లమని సవాలు విసిరాడు. కట్‌ చేస్తే...క్రైమ్‌ థిల్లర్‌లా సాగిన ఈ కథలో  చివరికి ఆమె పోలీసుల వద్దకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం...జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత  తిట్టడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకించడంతో ఆమెపై క్రూరంగా దాడి చేశాడు.కర్రతో బాదాడు, చెంపదెబ్బలు కొట్టాడు, బెదిరించాడు. ఆ హింసను భరించలేక, మాంగీబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.  ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చింది.


మొదటిసారి దొరికిపోయింది
గంటల తరబడి నడుచుకుంటూ ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు  వెడుతుండగానే, ఒక గుడి సమీపంలో ఆమె భర్త ఆమెను అడ్డుకుని, మళ్లీ దాడి చేసి, బలవంతంగా గ్రామానికి తీసుకువెళ్లాడు. మరింత క్రూరంగా మారిపోయాడు. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసులేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి,తాళం వేసేశాడు.  ఇప్పుడు చూస్తాను నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎలా ఫిర్యాదు చేస్తావో, ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో అంటూ బెదిరిస్తూ పదేపదే కొట్టాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్‌ను వేడి చేసి, ఆమె శరీరంపై కాల్చాడు. ఆమె నడుము, నడుము కింది భాగం, కుడి తొడపై ఈ వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా, ఎవరూ సాయం చేసేవారే లేకపోయారు. 24 గంటలు బయటకు వెళ్ల నివ్వలేదు, ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టాలని తాళం  వేసి బయటకు వెళ్లాడు. అతగాడి క్రూరత్వం, జరగబోయే హింసను ఊహించి భయంతో, రాజీకి అంగీకరించినట్లు నటించింది. కానీ మనసులో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూసింది.

దారి చూపిన రాయి
పంచాయతీ కోసం భర్త బయటికి వెళ్లగానే చుట్టూ సాయంకోసం వెదికింది. మాంగీబాయి కళ్ళు అక్కడ ఉన్న ఒక రాయిపై పడ్డాయి. అంతే దాన్నితీసుకుని తాళంపై  ఒకటి, రెండుసార్లు పదే పదే  తాళం పగిలే దాకా కొడుతూనే ఉంది.  చివరకు తాళం విరిగింది. గొలుసు తెగిపోయింది, బందీఖానానుంచి విముక్తి లభించింది. క్షణం కూడా వృధా చేయకుండా, ఆమె ఇంటి నుండి పరుగులు తీసి ఖిల్చిపూర్ వైపు నడవడం ప్రారంభించింది.

తీవ్ర అలసట,, ఒళ్లంతా గాయాలు,, ముళ్ళు గుచ్చుకుని తెగి రక్తమోడుతున్న పాదాలు, అయినా సరే తనను బంధించడానికి వాడిన ఇనుప గొలుసు ఇంకా మెడలోనే వేలాడుతుండగానే తన విముక్తి కోసం పయనం మొదలు పెట్టింది. చివరికి పోలీసు స్టేషన్‌ గడప తొక్కింది. ఆమె సాహసోపేత  ప్రయత్నం, తెగింపు  కారణంగా చివరకు ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్‌ దుర్మార్గానికి తెర పడేలా చేసింది.

 ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

 

చీకట్లో ఆరు కిలోమీటర్ల ప్రయాణం
చుట్టూ చీకటి.. మెడలోఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా.. మాంగీబాయి నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాలు, గరుకు మార్గాల గుండా నడక మొదలు పెట్టింది. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నారు. కానీ ఎవరూ కనీసం ఆగి ప్రశ్నించలేదు. అయితే, ఒక బాటసారి ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఏదైనా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది.

ఇదీ చదవండి: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సుందర్‌ పిచాయ్‌కు చేదు అనుభవం
షాక్‌కు గురైన పోలీసులు
రాత్రి 10 గంటల ప్రాంతంలో మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించగానే అక్కడున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. మెడలో తాళం వేసిన గొలుసు, శరీరంపై వాతలు , తీవ్ర భయాందోళలో గజ గజ వణికిపోతూ స్టేషన్‌కు చేరుకున్న  ఆమె కన్నీరుమున్నీరై, జరిగినదంతా వివరించింది. పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె శరీరంపై గాయాలు, వాతలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఒక పోలీసు బృందం గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement