breaking news
Ayush courses
-
‘నీట్’తోనే ఆయుష్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య డిగ్రీ కోర్సుల సీట్లను ఇకపై జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆధారంగానే భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్లనే తప్పనిసరిగా నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. తాజాగా ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్ హెల్త్ డిగ్రీ కోర్సుల సీట్లను కూడా నీట్ ర్యాంకుల ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రంలో వైద్య విద్యను పర్యవేక్షించే కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఈ మేరకు లేఖ రాసింది. రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్ హెల్త్ కోర్సులను నిర్వహించే కాలేజీలు 10 ఉన్నాయి. వీటిలో మొత్తం 695 సీట్లు ఉన్నాయి. నాచురోపతి–యోగిక్ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. వైద్య విద్యకు సంబంధించి అన్ని కోర్సులకు ఈసారి ఉమ్మడిగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ తప్పనిసరి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులతోపాటు ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్ హెల్త్ కోర్సుల్లో చేరాలనుకునేవారు కచ్చితంగా నీట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. మే 6న నీట్ జరగనుంది. కాళోజీ వర్సిటీ రాష్ట్రంలోని ఆయుర్వేద అనుబంధ కోర్సుల సీట్లను గతేడాది నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేసింది. వచ్చే ఏడాది కూడా ఈ ర్యాంకుల ప్రాతిపదికతోనే కౌన్సెలింగ్ జరగనుంది. – బి.కరుణాకర్‌రెడ్డి, వైస్ చాన్స్‌లర్, కాళోజీ వర్సిటీ -
తెలంగాణ ఎంసెట్
- ఇంజనీరింగ్, ఆయుష్, వ్యవసాయ కోర్సులకే తెలంగాణ ఎంసెట్ - రద్దుకానున్న ప్రైవేట్ మెడికల్ ప్రవేశ పరీక్షలు - ప్రైవేటులోని బీ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లన్నీ నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశానికి సుప్రీంకోర్టు ‘నీట్’ తప్పనిసరి చేయడంతో ఈ నెల 15న నిర్వహించే ఎంసెట్ (మెడికల్) ప్రవేశ పరీక్షపై నీలినీడలు అలుముకున్నాయి. వైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎంసెట్ (మెడికల్) ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఇక ఉండదని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కోరే విద్యార్థులంతా జూలైలో జరుగబోయే నీట్-2 ప్రవేశ పరీక్షకే సిద్ధం కాక తప్పదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒక్కసారికి ఎంసెట్‌కు అవకాశం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నీట్ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ద్వారానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లతోపాటు.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు, 35 శాతం బీ కేటగిరీ సీట్లు, 15 శాతం ఎన్నారై కోటా సీట్లన్నీ భర్తీ చేయాల్సి ఉంటుంది. మైనారిటీ మెడికల్ కాలేజీలు కూడా దీన్నే అనుసరించాల్సి ఉంటుంది. స్థానిక భాషలోనూ నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు సుప్రీం అవకాశం కల్పించడం విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. అయితే ఆయుర్వేద, హోమియో, యునాని, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించాలనుకున్న ప్రభుత్వ ఎంసెట్‌కు 1.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేటు మెడికల్ ప్రత్యేక ప్రవేశ పరీక్షకు 10 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2,600 ఎంబీబీఎస్ సీట్లు.. 1,140 బీడీఎస్ సీట్లు తెలంగాణలో మొత్తం 17 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో మొత్తం 2,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,450 సీట్లున్నాయి. ఇవిగాక రెండు మైనారిటీ కాలేజీల్లో 300 సీట్లున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తోంది. 10 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లల్లో 50 శాతం (725) ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తున్నారు. మరో 35 శాతం (507) బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం (218) సీట్లను ఎన్నారై కోటా కింద కాలేజీ యాజమాన్యాలే నేరుగా భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తమ ఆధ్వర్యంలోని బీ కేటగిరీ సీట్లను, ఎన్నారై (సీ కేటగగిరీ) సీట్లను నీట్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సుప్రీం తీర్పును శిరసా వహిస్తాం సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తాం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు నీట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాలి. నీట్‌పై అవగాహన కల్పించేందుకు, సిలబస్ పట్ల స్పష్టత ఇచ్చేందుకు పేద విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అవసరమైతే నీట్‌పై పుస్తకాలను కూడా పంపిణీ చేస్తాం. - సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వారు ఎంసెట్ రాయాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాట్లు చేస్తాం. అయితే ఆయుష్ కోర్సులు, వ్యవసాయం దాని అనుబంధ కోర్సుల్లో చేరాలనుకునే వారు మాత్రం ఎంసెట్ మెడికల్ ప్రవేశ పరీక్షనే రాయాల్సి ఉంటుంది. - డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, వరంగల్