టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ టీమ్ మెనెజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
తొలి మూడు టీ20ల్లో విఫలమైన సంజూ.. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ నేపథ్యంలో శాంసన్ ఔట్ అయిన తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.
'శాంట్నర్ బౌలింగ్‌లో సంజూ అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. అతడి బ్యాటింగ్‌లో ఫుట్ వర్క్ అస్సలు లేదు. బంతి పెద్దగా టర్న్ అవ్వకపోయినా, కేవలం రూమ్ కల్పించి ఆఫ్-సైడ్ ఆడాలనే తొందరలో క్లీన్ బౌల్డయ్యాడు. శాంసన్ తరచుగా లెగ్-స్టంప్ బయటకు కదులుతూ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో మూడు స్టంప్‌లు బౌలర్‌కు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బౌలర్ స్టంప్స్‌ను టార్గెట్ చేయడంతో అతడు క్లీప్ బౌల్డ్ అవ్వాల్సి వచ్చింది" అని కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు.
కాగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజూ కేవలం 40 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్‌కప్ తుది జట్టులో సంజూ స్ధానంపై సందిగ్థత నెలకొంది. ఎందుకంటే ప్రత్యామ్నయ ఓపెనర్‌గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. సంజూ స్ధానంలో ఓపెనర్‌గా ఇషాన్‌కు చోటు ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు.
చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన


