
టీమిండియా వన్డే వరల్డ్‌కప్-2011 గెలవడంలో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ది కీలక పాత్ర. ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ ఈవెంట్ మొత్తంలో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టి కీలక మ్యాచ్‌లలో భారత్‌ను గెలిపించాడు. యువీ లేని ఈ టోర్నీని ఊహించడం కూడా సాధ్యం కాదు.
అయితే, యువీని అసలు జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై తీవ్రమైన చర్చ నడిచిందట. 2010లో ఈ ఆల్‌రౌండర్ ఆట తీరు అంత గొప్పగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)తో పాటు అప్పటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మాత్రం అతడి కోసం పట్టుబట్టారట. ఇందుకు సంబంధించి కిర్‌స్టన్ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ధోని కూడా నాలాగే ఆలోచించాడు
‘‘నాడు ఆ జట్టు ఎంపిక అంత తేలికగా ఏమీ జరుగలేదు. పదిహేను మంది ప్లేయర్లు ఎవరా అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఆఖరి నిమిషంలో.. అతడిని జట్టులోకి తీసుకున్నాం. ఇందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.
నిజానికి నేను అతడిని తప్పక జట్టులోకి తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. ధోని కూడా నాలాగే ఆలోచించాడు. యువీ అనుభవాన్ని, అతడి ప్రతిభను మిస్ చేసుకోకూడదని మేము ఫిక్సయ్యాం. మా నమ్మకాన్ని నిలబెట్టేలా అతడు టోర్నీ ఆసాంతం ఎలా ఆడాడో అందరూ చూశారు కదా!
యువరాజ్ అంటే చాలా ఇష్టం
నాకు యువరాజ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. అయితే, ఎదుటివాళ్లకు చిరాకు తప్పించడం అతడికి అలవాటు. ఒక్కోసారి ఆ అల్లరి శ్రుతిమించుతుంది కూడా!.. అయినప్పటికీ అతడంటే నాకు అభిమానం.
చాలా మంచివాడు. అతడు ఎప్పుడు బ్యాటింగ్ చేసినా పెద్ద ఎత్తున పరుగులు రాబట్టాలని కోరుకుంటాను. అతడి బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తాను’’ అని గ్యారీ కిర్‌స్టెన్ పాత సంగతులు గుర్తు చేసుకుంటూ యువీపై ప్రశంసలు కురిపించాడు.
అతడి పాత్రా కీలకమే
ఇక యువీ వరల్డ్‌కప్ ప్రయాణం అంత తేలికగా ఏమీ సాగలేదన్న కిర్‌స్టన్.. ‘‘యువీని ప్రపంచకప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంలో ప్యాడీ ఉప్టన్ (మెంటల్ కండిషనింగ్- స్ట్రాటజిక్ లీడర్‌షిప్ కోచ్)ది కీలక పాత్ర. తను ఎల్లవేళలా యువీకి మద్దతుగా నిలిచాడు. ఇక యువరాజ్ కూడా కీలక సమయాల్లో తనను మోటివేట్ చేసుకుంటూ అనుకున్న ఫలితాలను రాబట్టగలిగాడు’’ అని చెప్పుకొచ్చాడు.
కాగా ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011 గెలిచిన భారత జట్లలో యువీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. అయితే, యువీ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మాత్రం ధోనిని ఉద్దేశించి ఎల్లప్పుడూ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటాడు.
ధోని వల్లే తన కుమారుడి కెరీర్ నాశనమైందంటూ తీవ్రస్థాయిలో అతడిని విమర్శిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని వాంఖడే వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టీమిండియా 2011లో ట్రోఫీని కైవసం చేసుకుంది.