రుతురాజ్‌ గై​క్వాడ్‌ కీలక నిర్ణయం | Ruturaj Gaikwad Pulls Out Of County Stint With Yorkshire Club Responds | Sakshi
Sakshi News home page

రుతురాజ్‌ గై​క్వాడ్‌ కీలక నిర్ణయం

Jul 19 2025 11:28 AM | Updated on Jul 19 2025 11:46 AM

Ruturaj Gaikwad Pulls Out Of County Stint With Yorkshire Club Responds

రుతురాజ్‌ గైక్వాడ్‌ (పాత ఫొటో PC: BCCI/IPL)

టీమిండియా క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) కీలక నిర్ణయం తీసుకున్నాడు. యార్క్‌షైర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అతడు వైదొలిగాడు. ఈ విషయాన్ని యార్క్‌షైర్‌ (Yorkshire) కౌంటీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

నిరాశకు గురిచేసింది
ఈ సందర్భంగా యార్క్‌షైర్‌ జట్టు హెడ్‌కోచ్‌ ఆంటోని మెగ్రాత్‌ మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగత కారణాల దృష్ట్యా గైక్వాడ్‌ ఇంగ్లండ్‌కు రాలేకపోతున్నాడు. అతడు ఈ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడు. ఈ విషయం మమ్మల్ని నిరాశకు గురిచేసింది.

అయితే, గైక్వాడ్‌ నిర్ణయానికి గల కచ్చితమైన కారణాన్ని నేను చెప్పలేను. అతడి స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసుకుంటాం. కానీ అందుకు సమయం తక్కువగా ఉంది. ఏదేమైనా ఈ విషయం గురించి నేను ఇంతకంటే ఎక్కువగా ఏమీ మాట్లాడలేను’’ అని పేర్కొన్నాడు.

కాగా ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకున్న రుతురాజ్‌ గైక్వాడ్‌ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 ఏళ్ల ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ తాజా కౌంటీ సీజన్‌లో సర్రేతో జరిగే మ్యాచ్‌తో అరంగేట్రం చేయాల్సి ఉంది.  అదే విధంగా వన్డే కప్‌లోనూ పాల్గొనాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఇంగ్లండ్‌కు వెళ్లే పరిస్థితి లేదని.. అందుకే తప్పుకొన్నాడని సమాచారం.

సీఎస్‌కే సారథిగా..
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా.. ఈ సీజన్‌ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. మోచేతి గాయం వల్ల ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరమయ్యాడు.

అయితే, ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన భారత- ‘ఎ’ జట్టుకు ఎంపికైన రుతురాజ్‌ గైక్వాడ్‌.. అనధికారిక టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయితే, ఇంట్రా- స్క్వాడ్‌ మ్యాచ్‌లో మాత్రం పాల్గొన్నాడు.

చివరగా జింబాబ్వేతో సిరీస్‌లో
కాగా ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడిన ఈ మహారాష్ట్ర కెప్టెన్‌ 41.77 సగటుతో 2632 పరుగులు సాధించాడు. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రుతురాజ్‌.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.

ఇప్పటికి భారత్‌ తరఫున 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 441 పరుగులు చేశాడు. ఆరు వన్డేల్లో 157 రన్స్‌ రాబట్టాడు. చివరగా 2024లో జింబాబ్వేతో టీ20 సిరీస్‌ సందర్భంగా రుతు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 

చదవండి: WCL 2025: హఫీజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బోణీ కొట్టిన పాకిస్తాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement