
PC: X
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్‌కు శుక్రవారం తెర లేచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్ తొలి మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ చాంపియన్స్- పాకిస్తాన్ చాంపియన్స్ (ENG vs PAK)తో తలపడింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు కమ్రాన్ అక్మల్ (8), షార్జీల్ ఖాన్ (12) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఉమర్ అమీన్ (6) కూడా నిరాశపరిచాడు.
హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఇలా టాపార్డర్ కుదేలైన వేళ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 34 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆమీర్ యామిన్ (13 బంతుల్లో 27 నాటౌట్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
ఇక ఇంగ్లండ్ చాంపియన్స్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్, క్రిస్ ట్రెమ్లెట్ రెండేసి వికెట్లు కూల్చగా.. విన్స్, మాస్కరన్హస్, ఆర్జే సైడ్‌బాటమ్, స్టువర్ట్ మీకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.
ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ
ఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (58) అర్ధ శతకంతో రాణించగా.. మరో ఓపెనర్ సర్ అలిస్టర్ కుక్ (7)తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన జేమ్స్ విన్స్ (7) విఫలమయ్యారు. ఆఖర్లో ఇయాన్ బెల్ (35 బంతుల్లో 51).. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (16)తో కలిసి జట్టును గెలుపుతీరాలకు చేర్చే దిశగా పయనించాడు. అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ బౌలర్ సొహైల్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి.. బెల్‌పై పైచేయి సాధించాడు.
ఇయాన్ బెల్ పోరాటం వృథా
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్ద నిలిచిన ఇంగ్లండ్ చాంపియన్స్.. ఐదు పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ బౌలర్లలో ఆమిర్ యమిన్, రాయిస్, సొహైల్ తన్వీర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికిన మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో తలపడుతున్నాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగింది.
చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు