
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)-2025 టోర్నమెంట్‌లో సెమీస్ ఆడకుండానే ఇండియా చాంపియన్స్ వెనుదిరిగింది. సెమీ ఫైనల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (IND vs PAK)ను ఎదుర్కోవాల్సి రావడమే ఇందుకు కారణం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ ఎలాంటి ‘బంధం’ వద్దంటూ భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ను బహిష్కరించారు.
దేశమే ముఖ్యమంటూ..
ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నమెంట్ నుంచే వెనుదిరిగాల్సి వచ్చినా.. దేశమే తమకు ముఖ్యమంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఇండియా చాంపియన్స్ తప్పుకోవడంతో పాకిస్తాన్ చాంపియన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.
సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డువే
ఇక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేట్ క్రికెట్ లీగ్‌లలో దేశం పేరును వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు సమాచారం. వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం.. ‘‘ప్రైవేట్ సంస్థలు పాకిస్తాన్ పేరును తమ లీగ్‌లలో ఉపయోగిస్తే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం.
క్రికెట్ ఈవెంట్లలో దేశం పేరు వాడుకునే సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. గురువారం జరిగిన బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
డబ్ల్యూసీఎల్ రెండో ఎడిషన్లో భారత క్రికెటర్లు పాకిస్తాన్‌తో ఆడమంటూ తిరస్కరించడం.. దేశ గౌరవానికి భంగం కలిగించింది. అందుకే ప్రైవేటు లీగ్‌లలో దేశం పేరు వాడవద్దని నిర్ణయించారు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆసియా కప్‌లో మాత్రం దాయాదుల పోరు!
ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025లో మాత్రం టీమిండియా పాకిస్తాన్‌తో ఆడేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, తటస్థ వేదికలపై మాత్రమే ఆడతామంటూ దాయాదులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. యూఏఈలో టోర్నీ జరుగనుంది.
ఈ క్రమంలో లీగ్ దశలో ఓసారి, సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఓసారి చిరకాల ప్రత్యర్థులు తలపడే అవకాశం ఉంది. మరోవైపు.. డబ్ల్యూసీఎల్-2025లో శనివారం నాటి ఫైనల్లో పాకిస్తాన్.. సౌతాఫ్రికా చాంపియన్స్‌ను ఢీకొట్టనుంది.
ఇదిలా ఉంటే.. పహల్గామ్‌లో ఉగ్రదాడికి బదులు.. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా.. భారత ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.
చదవండి: IPL 2026: గైక్వాడ్‌పై వేటు.. సీఎస్‌కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?