
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్‌కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్‌కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్‌కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.
2017లో అరంగేట్రం..
ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్‌లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్‌హెచ్‌తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.
అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.
కేఎల్ రాహుల్‌పై కన్ను..?
అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా సీఎస్‌కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్‌ను సీఎస్‌కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్‌పై వేటు వేసి రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్‌కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్