పాక్‌తో మ్యాచ్‌ బహిష్కరణ: స్పందించిన ధావన్‌.. మాలో కొందరు.. | Shikhar Dhawan Breaks Silence On Boycotting WCL 2025 Ind Vs Pak Match, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

పాక్‌తో మ్యాచ్‌ బహిష్కరణ: స్పందించిన శిఖర్‌ ధావన్‌.. మాలో కొందరు..

Aug 4 2025 8:19 AM | Updated on Aug 4 2025 10:12 AM

Shikhar Dhawan Breaks Silence On Boycotting WCL 2025 Ind vs Pak Match

పాకిస్తాన్‌ చాంపియన్స్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) స్పందించాడు.  తనపై ఎవరి ఒత్తిడీ లేదని.. తన మనసు చెప్పినట్లు మాత్రమే నడుచుకున్నానని తెలిపాడు. కాగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (WCL) -2025 టోర్నమెంట్లో భారత్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లను బహిష్కరించిన విషయం తెలిసిందే.

సెమీ ఫైనల్లోనూ..
లీగ్‌ దశలో దాయాదితో పోటీ పడాల్సి రాగా ఇండియా చాంపియన్స్‌ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసింది. అనంతరం ఇరుజట్లు తొలి సెమీ ఫైనల్లో తలపడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తే టోర్నీ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ భారత ఆటగాళ్లు.. తమకు దేశమే ముఖ్యమంటూ చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌ ఆడేది లేదని తేల్చిచెప్పారు.

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇండియా చాంపియన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పాకిస్తాన్‌ చాంపియన్స్‌ ఫైనల్‌ చేరింది. టైటిల్‌ పోరులో సౌతాఫ్రికా చేతిలో ఓడి పాక్‌ మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయం
ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా చాంపియన్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తాజాగా మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడటం వ్యక్తిగతంగా నాకు అస్సలు ఇష్టం లేదు. పూర్తి స్పృహలో ఉండి నేను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను.

మా జట్టులోని కొంత మంది నాతో పాటు ఏకీభవించారు. భజ్జీ పా (హర్భజన్‌ సింగ్‌) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుకే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని నిశ్చయించుకున్నాం.

ఎవరూ ఒత్తిడి చేయలేదు
మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని మాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. పాకిస్తాన్‌తో ఆడటం మాలో కొందరికి ఏమాత్రం ఇష్టం లేదు. పాక్‌తో మ్యాచ్‌ ఆడటానికి మాకు ఎటువంటి సరైన కారణం కనిపించనే లేదు. అంతకుమించి ఏమీ లేదు’’ అని తెలిపాడు. క్రిక్‌బ్లాగర్‌తో ముచ్చటిస్తూ ధావన్‌ ఈ మేరకు తన మనసులోని అభిప్రాయాలు పంచుకున్నాడు.

తొలి చాంపియన్‌ ఇండియా
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో నిర్వహిస్తున్న టీ20 టోర్నీయే డబ్ల్యూసీఎల్‌. గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా మొదలైన ఈ పొట్టి ఫార్మాట్‌ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ చాంపియన్స్‌ రూపంలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇక అరంగేట్ర సీజన్‌ ఫైనల్లో యువరాజ్‌ సింగ్‌ కెప్టెన్సీలోని ఇండియా చాంపియన్స్‌ పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ గెలిచింది.

ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌లోని ప్రశాంత పహల్గామ్‌ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి.. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. పాక్‌ ఆక్రమిత, పాక్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. దీంతో పాక్‌ ఆర్మీ ప్రతిదాడికి యత్నించగా.. భారత సైన్యం గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది.  

డబ్ల్యూసీఎల్‌-2025లో ఇండియా చాంపియన్స్‌ జట్టు ఇదే
యువరాజ్ సింగ్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.

చదవండి: బహిష్కరించిన భారత్‌.. పాక్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement