
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా సోలంకి జడేజా (Rivaba Solanki Jadeja) రాజకీయ జీవితంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్ర మంత్రిగా ఆమె శుక్రవారం (అక్టోబరు 17) ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రులంతా గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టగా.. రివాబా జడేజా తాజాగా మంత్రి అయ్యారు.
జడేజాతో ప్రేమ, పెళ్లి
రివాబా సింగ్ సోలంకి 1990, నవంబరు 2న జన్మించారు. తండ్రి హర్దేవ్ సింగ్ సోలంకి బిజినెస్‌మ్యాన్ కాగా.. తల్లి ప్రఫుల్లాబా సోలంకి భారత రైల్వేస్‌లో ఉద్యోగిని. రాజ్‌కోట్‌లో ఉన్నత విద్యనభ్యసించిన రివాబా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు.
రవీంద్ర జడేజా సోదరి నైనాబాకు రివాబా ఫ్రెండ్. ఓ పార్టీలో నైనా.. తన సోదరుడు రవీంద్ర జడేజాకు రివాబాను పరిచయం చేశారు. అలా జడ్డు- రివాబాల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరుకుటుంబాల సమ్మతితో 2016లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2017లో రివాబా- జడ్డూ దంపతులకు కూతురు నిధ్యానా జన్మించింది.
సామాజిక సేవ
పెళ్లికి ముందు నుంచే రివాబా తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు. రాజ్‌పుత్‌లకు చెందిన కర్ణి సేన మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రివాబా బీజేపీలో చేరారు.
ఈ క్రమంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రివాబా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాతృశక్తి అనే చారిటబుల్ ట్రస్టు ద్వారా మహిళా సాధికారికత, సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా జడ్డూ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న రివాబా.. చిన్న వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
టీమిండియా అత్యుత్తమ ఆల్‌రౌండర్
సౌరాష్ట్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులు, 204 వన్డేలు, 74 టీ20 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. ఆయా ఫార్మాట్లలో 3990, 2806, 515 పరుగులు సాధించాడు.
ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖాతాలో 338 టెస్టు వికెట్లు, 231 వన్డే వికెట్లు, 54 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక భార్య రివాబాతో కలిసి జడ్డూ సైతం గతంలోనే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి!