సాక్షి శబరిమల: మొన్నటివరకు జసందోహంతో కిటకిటలాడిన శబరిమల ఈ రోజు చాలా ఖాళీగా దర్శనమిచ్చింది. వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది దాక రాలేదు. అందువల్ల గత రెండు రోజులుగా అయ్యప్ప స్వామి దర్శనానికి రద్దీ తగ్గింది. స్పాట్ బుకింగ్ పరిమితిని పెంచుకోవచ్చని కేరళ హైకోర్టు చెప్పినా.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సన్నిధానంలోని నడపండాల్, పదునెట్టాంబడి(18 మెట్లు), అయ్యప్ప ఆలయ ప్రాంగణం, మాలికాపురోత్తమ్మ మంజుమాత ఆలయం వద్ద రద్దీ తక్కువగా ఉండటం గమనార్హం.
అలాగే 18వ మెట్టు ఎక్కడానికి క్యూలైన్ నిన్నమొన్నటి వరకు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సగటున నిమిషానికి 85 మంది భక్తులు 18 మెట్లను అధిరోహించారు. సోమవారం మాత్రం ఇక్కడి క్యూలైన్లలో భక్తులు తక్కువగా కనిపించారు. పంపా నుంచి వచ్చిన వారు వేచి ఉండకుండా నేరుగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం 7.30 గంటలకు పూజ సమయం కావడంతో 18వ మెట్టు ఎక్కడానికి అరగంటపాటు నిలిపివేసినా కూడా అంతగా రద్దీ లేదు. ఇదిలా ఉండగా, డిసెంబరు 27తో వర్చువల్ క్యూబుకింగ్ పూర్తయింది. ఒకవేళ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. అక్కడ ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం మండలకాలం ముగిసేవరకు ఎవరూ కొత్త స్లాట్ బుక్ చేసుకోలేరు.
ఇక ప్రతి రోజు శబరిమల సన్నిధానం రద్దీ ఆధారంగా స్పాట్ బుకింగ్‌లకు అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నీలక్కల్‌లో, వండిపెరియార్ వద్ద మాత్రమే స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. ఈ స్పాట్ బుకింగ్ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. అదంతా గంటలోపు పూర్తవుతుంది. దాంతో ఇరుముడితో వచ్చే యాత్రికులు నిరాశతో నీలక్కల్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగా, గతేడాది ఇరుముడితో వచ్చే భక్తులను ఎవ్వరిని వెనక్కి పంపకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆ వైఖరిని మార్చడం గమనార్హం..!
దీనివల్ల యాత్రికులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి. అయితే దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మాత్రం తగ్గుతోంది. ఈ ఉదయం వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 12.13 లక్షల మంది అయ్యప్పలు ఆలయాన్ని సందర్శించారు.
(చదవండి: ఆ హరిహరసుతుడికి పిండిచేసిన పాయసం నుంచి నువ్వుల పాయసం వరకు..!)


