breaking news
ayyapa Devotees
-
పులిమేడు రూట్లో భక్తుల రద్దీ
సాక్షి శబరిమల: శబరిమలకు వెళ్ళే భక్తులకు ప్రత్యామ్నాయ మార్గం అయిన అటవీ మార్గం పులిమేడులో యాత్రికుల రద్దీ బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రతిరోజూ సుమారు 1,500 మంది నుంచి రెండు వేల మంది దాక యాత్రికులు తరలివస్తున్నట్లు అటవీశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పెరియార్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లేఈ అటవీమార్గంలో భక్తుల సంరక్షణార్థం ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. సత్రం నుంచి సన్నిధానం వరకు సుమారు 12 కి.మీ దూరం ఉంటుంది. అయితే అక్కడి వాతావరణాన్ని అనుసరించి యాత్రికులకు ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించేందుకు అనమతి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యాత్రికులకు సత్రం నుంచి సన్నిధానం చేరుకోవడానికి అనుమతి ఉంది. అలాగే ఉదయం 8 నుంచి 11 గంటలలోపు యాత్రికులు తిరిగి సత్రానికి ప్రయాణించటానికి అనుమతి ఉంది. అలాగే దేవస్వం బోర్డు సత్రంలో కూడా స్పాట్ బుకింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నుంచి ఉన్న అనుమతిని ఆధారం ప్రయాణానికి అనుమతి ఉంటుంది. సత్రాన్ని వదిలి సన్నిధానం వరకు వెళ్లే యాత్రికుల బృందాలతో తమ శాఖ అధికారులు వెళ్తారని అటవీ శాఖ వెల్లడించింది. దీంతో పాటు యాత్రికులు భద్రతా, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు సుమారు 35 మంది అటవీ శాఖ అధికారులు 35 మంది ఎకో గార్డులు ఉన్నారని పేర్నొంది. అలాగే అదనంగా ఈ మార్గంలో ఎలిఫెంట్ స్క్వాడ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏనుగులు, గేదెలు, అడవి జంతువులు లేవని నిర్థారించడానికి అటవీగార్డు బృందం సదా అప్రమత్తమై ఉండటమే గాక, జంతువులు లేవని నిర్ధారణ అయితేనే యాత్రికులను ప్రయాణించడానికి అనుమతిస్తామని అఝుతా రేంజ్ ఆఫీసర్ డి. బన్నీ తెలిపారు. వర్షం పడితే ఈ అటవీ మార్గం గుండా ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే కఝుతాకుళి నుంచి కొన్ని మైళ్ల తర్వాత అంతా బురదమయంగా ఉంటుంది. అందువల్ల ఈ మార్గం గుండా వెళ్లడం చాలా కష్టం. సత్రాన్ని సందర్శించే యాత్రికుల పత్రాలను ఉప్పుపారలోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో తనిఖీ చేస్తారు. అలాగే ఈ అటవీ గార్డుల తోపాటు పోలీసు, ఆరోగ్య శాఖల సేవలను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేశారు. ఇవేగాక ఈ అటవీ మార్గంలో ఇరికప్పర, సీతకులం, జీరో పాయింట్ వద్ద పరిశుభ్రమైన నీరు , ఉప్పుపార బేస్ వద్ద టీ , స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ అటవీ మార్గం గుండా వచ్చే యాత్రికుల వివరాలను సన్నిధానం పక్కన ఉన్న అటవీ శాఖ, పోలీసు చెక్‌పోస్టులలో కూడా నమోదు చేస్తారు. (చదవండి: 16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే..) -
శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!
సాక్షి శబరిమల: మొన్నటివరకు జసందోహంతో కిటకిటలాడిన శబరిమల ఈ రోజు చాలా ఖాళీగా దర్శనమిచ్చింది. వర్చువల్ క్యూ ద్వారా బుక్ చేసుకున్న వారిలో దాదాపు 15% మంది దాక రాలేదు. అందువల్ల గత రెండు రోజులుగా అయ్యప్ప స్వామి దర్శనానికి రద్దీ తగ్గింది. స్పాట్ బుకింగ్ పరిమితిని పెంచుకోవచ్చని కేరళ హైకోర్టు చెప్పినా.. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి సన్నిధానంలోని నడపండాల్, పదునెట్టాంబడి(18 మెట్లు), అయ్యప్ప ఆలయ ప్రాంగణం, మాలికాపురోత్తమ్మ మంజుమాత ఆలయం వద్ద రద్దీ తక్కువగా ఉండటం గమనార్హం. అలాగే 18వ మెట్టు ఎక్కడానికి క్యూలైన్ నిన్నమొన్నటి వరకు ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సగటున నిమిషానికి 85 మంది భక్తులు 18 మెట్లను అధిరోహించారు. సోమవారం మాత్రం ఇక్కడి క్యూలైన్లలో భక్తులు తక్కువగా కనిపించారు. పంపా నుంచి వచ్చిన వారు వేచి ఉండకుండా నేరుగా మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం 7.30 గంటలకు పూజ సమయం కావడంతో 18వ మెట్టు ఎక్కడానికి అరగంటపాటు నిలిపివేసినా కూడా అంతగా రద్దీ లేదు. ఇదిలా ఉండగా, డిసెంబరు 27తో వర్చువల్ క్యూబుకింగ్ పూర్తయింది. ఒకవేళ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. అక్కడ ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం మండలకాలం ముగిసేవరకు ఎవరూ కొత్త స్లాట్ బుక్ చేసుకోలేరు. ఇక ప్రతి రోజు శబరిమల సన్నిధానం రద్దీ ఆధారంగా స్పాట్ బుకింగ్‌లకు అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నీలక్కల్లో, వండిపెరియార్ వద్ద మాత్రమే స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. ఈ స్పాట్ బుకింగ్ అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. అదంతా గంటలోపు పూర్తవుతుంది. దాంతో ఇరుముడితో వచ్చే యాత్రికులు నిరాశతో నీలక్కల్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాగా, గతేడాది ఇరుముడితో వచ్చే భక్తులను ఎవ్వరిని వెనక్కి పంపకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆ వైఖరిని మార్చడం గమనార్హం..! దీనివల్ల యాత్రికులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వుతున్నాయి. అయితే దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మాత్రం తగ్గుతోంది. ఈ ఉదయం వరకు ఉన్న గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 12.13 లక్షల మంది అయ్యప్పలు ఆలయాన్ని సందర్శించారు.(చదవండి: ఆ హరిహరసుతుడికి పిండిచేసిన పాయసం నుంచి నువ్వుల పాయసం వరకు..!) -
శబరిమల అయ్యప్పకు అర్పించే నైవేద్యాలివే..!
శబరిమల అయ్యప్పస్వామి అనగానే నోరూరించే అరవణ ప్రసాదమే గుర్తొస్తుంటుంది. ఆ ప్రసాదం ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఒక్క ప్రసాదమే కాదు నాలుగు రకాల పాయసాలను ఆ హరిహరసుతుడికి నివేదిస్తారు. అవన్నీ ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగినవి. తక్షణ శక్తిని ఇచ్చేవి. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అరవణ పాయసంతోపాటు సమర్పించే ఇతర నైవేద్యాల వివరాలు, వాటి ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందాం.⇒ ఉషః కాలంలో ఉదయం 7.30 గంటల సమయంలో కొబ్బరి పిండితో చేసిన పాయసాన్ని నివేదిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగా ఈ పాయసం కొబ్బరికాయను చూర్ణం చేసి.. ఆ పిండికి, రెండు గ్లాసుల కొబ్బరి పాలకు బెల్లం జోడించి తయారు చేస్తారు. ⇒ మధ్యాహ్నం 12 గంటల పూజ కోసం అరవణ పాయసాన్ని నివేదిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రైస్, ఎండు కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఎండు ద్రాక్ష, తాటిబెల్లం, శొంఠిపొడి, యాలకుల పొడి, పచ్చ కర్పూరంతో తయారవుతుంది. ⇒ ఇక మిగతా పూజాసమయాల్లో తెల్ల నైవేద్యాన్ని నివేదిస్తారు. రాత్రి 9.15 గంటలకు సాయంత్రం పూజ కోసం నువ్వుల పాయసం నివేదిస్తారు. ఈ మేరకు శబరిమల తంత్రి కంఠరార్ మహేష్ మోహనార్ మాట్లాడుతూ.. ‘‘నువ్వుల పాయసం నిజానికి పాయసం రూపంలో ఉండదు.. నువ్వులే’’ అని చెప్పుకొచ్చారు. సాయంత్రం పూజ కోసం అయ్యప్పకు పానకం, అప్పం, అడ అనే పానీయం నివేదిస్తారు. ఇక్కడ పానకం అనేది జీలకర్ర, బెల్లం, పసుపు, నల్ల మిరియాలు కలిపిన ఔషధ మిశ్రమం.అత్యంత స్పెషల్ పంచామృతం..తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడు అభిషేకానికి ఈ పంచామృతాన్ని వినియోగిస్తారు. స్పటికబెల్లం, బెల్లం, అరటి పండు, ఎండు ద్రాక్ష(కిస్మిస్), నెయ్యి, తేనె, యాలకుల పొడి, లవంగాల పొడి, తదితర ఎనిమిది పొడులను కలిపి పంచామృతం తయారు చేస్తారు. పాయసాలలో అరవణ తర్వాత పంచామృతం అత్యంత రుచికరమైన ప్రసాదంగా భక్తులు చెబుతుంటారు. అంతేాకాదు శబరిమలలో ఈ అరవణ ప్రసాదంతోపాటు అచ్చం అరవణ టన్ మాదిరి సగం సీసాలో ఈ పంచామృతాన్ని విక్రయిస్తారు. దీని ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ.125లు పలుకుతుంది. అయ్యప్ప స్వామి పూజా విధానాలే కాదు నివేదించే నైవేద్యాలు కూడా అత్యంత ప్రత్యేకమే కదా..!.(చదవండి: దేవస్వం బోర్డు మైదానంలో పార్కింగ్‌పై ఫిర్యాదులు..!) -
ఇలా బుక్ చేసుకుంటే.. కన్నిస్వాములకు శబరిమల యాత్ర ఉచితం..!
మండలం-మకరవిలక్కు పూజలతో శబరిమల జనసందోహంగా మారింది. భక్తులు నిరంతరం పంపాలో స్నానం చేసి శబరిగిరిపైకి చేరుతారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తారు. ముఖ్యంగా మొదటి సారి మాలధారణ చేసి, ఇరుముడితో కొండకు వచ్చే కన్ని స్వాములు శరణ్గుత్తిలో బాణం/శరం గుచ్చి, అయ్యప్పను దర్శించుకున్నాక.. మాలికపురోత్తమ మంజుమాత ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.మహిషిని అయ్యప్ప సంహరించాక.. ఆమె మాలికాపురోత్తమ(మాలికాపురం) లేదా మంజుమాతగా అవతరించినట్లు చెబుతారు. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప.. ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మాలికాపురోత్తమ నొచ్చుకోవడంతో.. ఏటా తన దర్శనానికి కన్నిస్వాములు రాని సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కన్ని స్వాములు ఏటా ఎరుమేలిలో వేటతుళ్లి ఆడేప్పుడు శరం/బాణం తీసుకుని, దాన్ని తమవద్దే భద్రపరుచుకుంటారు. పంపాస్నానం తర్వాత శబరిపీఠం దాటాక.. శరణ్గుత్తి వద్ద గుచ్చుతారు. ఏటా మకరవిళక్కు పర్వదినానికి ముందు మంజుమాత అయ్యప్ప సన్నిధి సమీపంలోని ఆలయం నుంచి ఏనుగు అంబారీపై శరణ్గుత్తి వరకు రావడం.. కన్నిస్వాములు వచ్చారనడానికి గుర్తుగా అక్కడ బాణాలు ఉండడం చూసి, నిరాశగా వెళ్లడం ఏటా జరిగే తంతులో భాగమే.అందుకే కన్నిస్వాములకు అయ్యప్ప యాత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) కూడా కన్నిస్వాముల కోసం ప్రత్యేక సేవలు అందిస్తోంది. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకునే కన్ని స్వాములకు కేవలం ఒక్కరూపాయి చార్జీతో.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి పంపాబేస్ వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ బస్సు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. (చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!) -
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
తిరువనంతపురం: శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళుతున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. నేడు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్నారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. ప్రత్యేక రైళ్లు.. ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. ఇదీ చదవండి: ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి -
మీరు భక్తురాలా... అవును అయితే ఏంటి?!
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకోవడం వెనుక కేరళ సీఎం పినరయి విజయన్ తోడ్పాటు ఉందన్నవార్తలను కనకదుర్గ, బిందులు ఖండించారు. తమకు ఉన్న హక్కును ఉపయోగించుకున్నామే తప్ప ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ.. రుతుస్రావ వయసులో ఉన్న కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు అమ్మిని(42)లు బుధవారం అయ్యప్పను దర్శించుకున్న విషయం తెలిసిందే. దీంలో కేరళ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి విజయన్ సహకారంతోనే ఆ ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి అపచారం చేశారంటూ సంఘ్ పరివార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కనకదుర్గ, బిందులు ఖండించారు. తాము అయ్యప్ప దర్శనం చేసుకునే క్రమంలో భక్తులెవరూ అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు వివాదాస్పదం చేస్తున్నాయని విమర్శించారు. భక్తులూ.. కార్యకర్తలు ఎవరైనా వెళ్లవచ్చు ఆలయ ప్రవేశం గురించి కనకదుర్గ మాట్లాడుతూ... ‘ ఇది నా సొంత నిర్ణయం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని పోలీసుల సహాయంతో గుడిలో అడుగుపెట్టాము. ఈ విషయంలో సీఎం మాకు సహాయం చేశారో లేదోనన్న సంగతి మాకైతే తెలియదు. ఒకే భావజాలం ఉన్న మేమిద్దరం(బిందు, నేను) స్వామిని దర్శించుకోవాలనుకున్నాం. ఇందులో పోలీసులు, రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. కొందరు బీజేపీ కార్యకర్తలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా సామాజిక కార్యకర్తగా ఉన్న మీరు భక్తురాలా అని విలేరులు ప్రశ్నించగా... ‘ అవును నేను కార్యకర్తను. అలాగే భక్తురాలిని కూడా. నేనే కాదు మరికొంత మంది నాలాంటి కార్యకర్తలు దేవుడిని దర్శించుకోవచ్చు. భక్తులైనా, కార్యకర్తలైనా అన్ని వయస్సుల మహిళలు గుడిలోకి వెళ్లవచ్చని కదా సుప్రీం తీర్పునిచ్చింది’ అని సమాధానమిచ్చారు.(చదవండి : ఆ ఇద్దరు మహిళలు ఎవరు?) ప్రస్తుతం ఏ పార్టీలో లేను ‘ప్రస్తుతం నేను ఏ పార్టీకి చెందినదాన్ని కాదు. గతంలో సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీలో భాగంగా ఉండేదాన్ని. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రాజీనామా చేశారు. డిసెంబరు 24నే దర్శనం చేసుకుందామనుకున్నాం. కానీ ఆరోజు కుదరలేదు. ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్లీ దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం రాదని భావించాం. పంబా పోలీసులను రక్షణ కోరాం. కాలినడకన వెళ్లి.. అనుకున్నట్టుగానే అయ్యప్ప దర్శనం చేసుకున్నాం’ అని’ బిందు పేర్కొన్నారు. కాగా కేరళ యూనివర్శిటీ నుంచి మాస్టర్ లా పట్టాను సాధించిన బిందు అమ్మిని ప్రస్తుతం కన్నూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తుండగా... కేరళ పౌర సరఫరాల కార్పొరేషన్లో కనకదుర్గ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక...‘నవోతన కేరళం శబరిమలాయిలెక్కు’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. -
ఆ ఇద్దరు మహిళలు ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : బిందు అమ్మినికి 42 ఏళ్లు. కనకదుర్గకు 41 ఏళ్లు. వీరిరువురు బుధవారం తెల్లవారు జామున శబరిమలలోని అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఇంతకు వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి జీవిత నేపథ్యం ఏమిటీ? పదేళ్లకుపైగా యాభై ఏళ్లకు లోపు వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదంటూ ఆరెస్సెస్, హిందూత్వ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీరెందుకు ఈ సాహసానికి ఒడిగట్టారు? బిందు, కనకదుర్గ డిసెంబర్ 24వ తేదీనే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్ కార్యకర్తల ఆందోళన వల్ల అది వారికి సాధ్యం కాలేదు. దాంతో వారు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ వారం రోజులు వారు కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా ఎలాంటి కాంటాక్టు పెట్టుకోలేదు. వారిలో కనకదుర్గ కుటుంబమైతే ఆమె తప్పిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయ్యప్ప ఆలయ సందర్శనానికని వెళ్లి అదృశ్యమైందని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పారు. వారు ఈ వారం రోజులపాటు పోలీసుల రక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. లింగ వివక్షను రూపుమాపాలంటూ కేరళలో 620 కిలోమీటర్ల పొడవున మహిళల మానవహారం ప్రదర్శన జరిపిన మరునాడే, అంటే మంగళవారం ఎర్నాకులం నుంచి బయల్దేరి అయ్యప్ప ప్రవేశ ద్వారమైన పంపాకు చేరుకున్నారు. వారు అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్ సహాయంతో రాత్రి 2.30 గంటలకు కొండలపైకి బయల్దేరి వెళ్లారు. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. 3.45 గంటలకు గర్భగుడిలోకి ప్రవేశించి ప్రార్థనలు జరిపారు. తాము ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి చాలామంది భక్తులు తమను చూశారని, అయితే ఎవరు కూడా తమను అడ్డుకునేందుకు ప్రయత్నించలేదని బిందు అమ్మిని, కనకదుర్గలు వివరించారు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17 మంది మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బిందు అమ్మిని కేరళ యూనివర్శిటీ నుంచి మాస్టర్ లా పట్టాను సాధించిన బిందు అమ్మిని ప్రస్తుతం కన్నూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆమె విద్యార్థి రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. వామపక్ష పార్టీకి అనుబంధంగా ఉన్న కేరళ విద్యార్థి సంఘటనలో పనిచేశారు. బిందు దళిత కార్యకర్త కూడా. ఆమె సామాజిక న్యాయం కోసం, లింగ వివక్షతపై పోరాడే కార్యకర్తగా ఆమె తన మిత్రులకు, విద్యార్థినీ విద్యార్థులకు సుపరిచితం. బిందు రాజకీయ కార్యకర్త హరిహరన్ పెళ్లి చేసుకున్నారు. పూక్కడ్లో నివసిస్తున్న వారికి 11 ఏళ్ల ఓల్గా అనే కూతురు కూడా ఉంది. కనకదుర్గ నాయర్ అనే అగ్రకులానికి చెందిన కనకదుర్గ ‘నవోతన కేరళం శబరిమలాయిలెక్కు’ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా బిందుకు పరిచయం అయ్యారు. అయ్యప్ప ఆలయాన్ని ఎలాగైన సందర్శించాలన్న తాపత్రయంతోనే ఈ పేజీని ఏర్పాటు చేశారు. కేరళ పౌర సరఫరాల కార్పొరేషన్లో కనకదుర్గ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కృష్ణనున్ని అనే ఇంజనీర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. మలప్పురంలో నివసిస్తున్న ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కనకదుర్గ ఆద్యాత్మిక చింతన కలిగిన హిందువని, ఆమె అయ్యప్ప ఆలయం ఎందుకు వెళ్లాలనుకుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్న భరత్ భూషణ్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
శబరిమల వెళ్లొస్తుండగా.. రోడ్డు ప్రమాదం
బోడుప్పల్: కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. బోడుప్పల్ గ్రామానికి చెందిన 10 మంది అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్నేత నత్తి మైసయ్య కుమారుడు నత్తి అజయ్ కుమార్ (22), మైసగల్ల బాలయ్య, కామగల్ల వెంకటేశ్, సందీప్, నర్సింహ్మ, బాబ, అనిల్‌తోపాటు మరో ఇద్దరు కలిసి అయ్యప్ప మాల వేసుకుని క్వాలిస్‌లో శబరి మలై వెళ్లారు. శబరిమలై నుంచి తిరిగి వస్తూ తిరుపతి వచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని సోమవారం బోడుప్పల్‌కు తిరిగి వస్తున్నారు. కోడూరు వద్దకు రాగానే మలుపు వద్ద ఉన్న కంటైనర్‌ను క్వాలిస్ ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నత్తి అజయ్‌కుమార్ అక్కడక్కడే మృతి చెందాడు. మిగతా 9 మందికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.


