మండలం-మకరవిలక్కు పూజలతో శబరిమల జనసందోహంగా మారింది. భక్తులు నిరంతరం పంపాలో స్నానం చేసి శబరిగిరిపైకి చేరుతారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివస్తారు. ముఖ్యంగా మొదటి సారి మాలధారణ చేసి, ఇరుముడితో కొండకు వచ్చే కన్ని స్వాములు శరణ్‌గుత్తిలో బాణం/శరం గుచ్చి, అయ్యప్పను దర్శించుకున్నాక.. మాలికపురోత్తమ మంజుమాత ఆలయానికి చేరుకుంటారు. ఇందుకు అనేక కారణాలున్నాయి.
మహిషిని అయ్యప్ప సంహరించాక.. ఆమె మాలికాపురోత్తమ(మాలికాపురం) లేదా మంజుమాతగా అవతరించినట్లు చెబుతారు. ఆమె అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆజన్మ బ్రహ్మచారి అయిన అయ్యప్ప.. ఆమె ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. అయితే.. మాలికాపురోత్తమ నొచ్చుకోవడంతో.. ఏటా తన దర్శనానికి కన్నిస్వాములు రాని సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కన్ని స్వాములు ఏటా ఎరుమేలిలో వేటతుళ్లి ఆడేప్పుడు శరం/బాణం తీసుకుని, దాన్ని తమవద్దే భద్రపరుచుకుంటారు. పంపాస్నానం తర్వాత శబరిపీఠం దాటాక.. శరణ్‌గుత్తి వద్ద గుచ్చుతారు. ఏటా మకరవిళక్కు పర్వదినానికి ముందు మంజుమాత అయ్యప్ప సన్నిధి సమీపంలోని ఆలయం నుంచి ఏనుగు అంబారీపై శరణ్‌గుత్తి వరకు రావడం.. కన్నిస్వాములు వచ్చారనడానికి గుర్తుగా అక్కడ బాణాలు ఉండడం చూసి, నిరాశగా వెళ్లడం ఏటా జరిగే తంతులో భాగమే.
అందుకే కన్నిస్వాములకు అయ్యప్ప యాత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) కూడా కన్నిస్వాముల కోసం ప్రత్యేక సేవలు అందిస్తోంది. కేఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకునే కన్ని స్వాములకు కేవలం ఒక్కరూపాయి చార్జీతో.. తిరువనంతపురం సెంట్రల్ నుంచి పంపాబేస్ వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ బస్సు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది.


