నేటి మధ్యాహ్నం 12.17 గంటలకు ప్రక్రియ ప్రారంభం
సోమవారం ఉదయం 10.17 గంటలకు ప్రయోగం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ– 62 రాకెట్ ప్రయోగంతో 2026లో భారత్ శుభారంభం చేస్తుంది. నాలుగు దశల రాకెట్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసి ఎంఎస్‌టీ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి శనివారం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్‌ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం మ«ద్యాహ్నం 12.17 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. సోమవారం ఉదయం 10.17 గంటలకు ప్రయోగం చేయనున్నట్టు ల్యాబ్ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 65వది కావడం విశేషం. పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ అంటే రెండు స్ట్రాపాన్ బూస్టర్లు రాకెట్ వెర్షన్‌లో ఇది ఐదో ప్రయోగం.
పీఎస్‌ఎల్‌వీ సీ–62 రాకెట్ వివరాలు
పీఎస్‌ఎల్‌వీ సీ–62 రాకెట్ 44.4 మీటర్ల పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260.1 టన్నుల బరువు ఉంటుంది. ప్రయోగంలో నాలుగుదశలను 18.9 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 139 టన్నుల ఘన ఇంధనంతో 112.06 సెకెండ్లకు పూర్తి చేయనున్నారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 107.86 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్‌షీల్డ్ విడిపోతాయి.
అంటే మొదటి దశ ప్రయాణ సమయంలోనే విడిపోతాయన్నమాట. అనంతరం 41.8 టన్నుల ద్రవ ఇంధనంతో 263.36 సెకెండ్ల రెండోదశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 494.72 సెకెండ్లకు మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 984.62 సెకెండ్లకు నాలుగోదశను కటాఫ్ చేస్తారు. ఆ తర్వాత నాలుగోదశలో ద్రవ ఇంధన మోటార్‌తోనే 1074.62 సెకెండ్లకు (18.9 నిమిషాల్లో) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు.
ప్రత్యేకతలు ఇవీ
ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన ఈవోఎస్–ఎన్1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరో 10 సెకెండ్ల తర్వాత 14 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెడతారు.
⇒ అనంతరం పీఎస్–4 దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్‌దేశానికి చెందిన కిడ్ అనే పేలోడ్‌ను ప్రవేశపెట్టి ఈ రెండో దశలో పసిఫిక్ మహాసముద్రంలోకి పడేలా డిజైన్ చేశారు.


