శబరిమల యాత్రలో ఆ రెండుచోట్ల గుండెపోటు ముప్పు!  | Kerala has issued a major health advisory for Sabriala pilgrims | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రలో ఆ రెండుచోట్ల గుండెపోటు ముప్పు! 

Nov 30 2025 6:30 AM | Updated on Nov 30 2025 10:44 AM

Kerala has issued a major health advisory for Sabriala pilgrims
  • ఏటా నమోదవుతున్న మరణాలు 
  • నీలిమల అధిరోహణ సమయంలో జరభద్రం 
  • అప్పాచిమేడులోనూ అప్రమత్తత అవసరం 
  • దీర్ఘకాలిక వ్యాధులుంటే.. నడకలో వేగం వద్దు 
  • డీహైడ్రేషన్, ఖాళీ కడుపుతో కొండెక్కడం పెను ప్రమాదం 
  • ఏటా 20 నుంచి 40 గుండెపోటు మరణాల నమోదు

శబరిమల యాత్రికులకు రెండుచోట్ల గుండెపోటు ముప్పు పొంచి ఉంది! సముద్రమట్టానికి ఎత్తయిన ప్రాంతంలోకి వెళ్తుండడం.. ఉపవాసాలు, డీహైడ్రేషన్, ఆక్సిజన్‌ లభ్యత తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వయానా కేరళ వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న విషయమిది. పంపా బేస్‌ నుంచి శబరిమలకు వెళ్లే చిన్నపాదం మార్గంలో అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతోపాటు.. కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ఆరోగ్యశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో స్పష్టమవుతోంది. 

ప్రతిఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య  
ప్రతిఏటా నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోటుతో భక్తులు కుప్పకూలిపోతున్న ఉదంతాలు.. మరణాలు నమోదవుతున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవోస్వం బోర్డు(టీడీబీ), కేరళ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు క్రైం డేటా రికార్డ్‌ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఏడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2017–18 సీజన్‌లో 281 మంది గుండెపోటు బారినపడగా, వారిలో 36 మంది మృతి చెందారు. 

2018–19లో 173 గుండెపోటు కేసులు నమోదుకాగా, 24 మంది మరణించారు, 2019–20లో 19, 2022–23లో 24, 2023–24లో మరో 24, 2024–25లో 40 గుండెపోటు మరణాలు నమోదయ్యాయి. 2025–26 సీజన్‌ ప్రస్తుతం కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఓ మహిళ గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు పోలీసు రికార్డులు చెబుతుండగా, 8 మరణాలు నమోదైనట్లు నాలుగు రోజుల క్రితం ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. 2020–22లో మాత్రం కొవిడ్‌ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సీజన్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. 


అక్కడే ఎందుకు?  
సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం, ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోట్లు అధికంగా సంభవిస్తున్నాయి. నీలిమల కొండ నిటారుగా, చాలా ఎత్తుగా ఉంటుంది. శబరియాత్రలో పెద్దపాదంలో ముక్కు కొండగా పిలిచే కరిమల కొండ తర్వాత.. చిన్నపాదంలో దాదాపు అదే స్థాయిలోనే నీలిమల ఉంటుంది. 

నీలిమలను అధిరోహించేందుకు ట్రావెన్‌కోర్‌ దేవోస్వం బోర్డు ఏర్పాటు చేసిన మెట్లు ఉన్నప్పటికీ భక్తులు ఈ ఒక్క కొండను అధిరోహిస్తే ఇబ్బందులు దూరమవుతాయనే ఉద్దేశంతో నడకలో వేగాన్ని పెంచుతారు. లేదంటే.. ముందు నడిచివెళ్లే తమ బృందంలోని సభ్యులను అందుకోవాలనే ఉద్దేశంతో వడివడిగా నడుస్తారు. దాంతో హార్ట్‌ బీట్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఆక్సిజన్‌ తగ్గుతుంది. డిమాండ్‌ పెరగడం.. అందుకు అనుగుణంగా ప్రాణవాయువు అందకపోవడంతో శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. 

హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గులకు తోడు.. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడంతో గుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదాలుంటాయని వైద్య నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు, కొలె్రస్టాల్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నీలిమల అధిరోహించేప్పుడు వేగాన్ని పెంచడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక అప్పాచిమేడు ప్రాంతంలో కొండ ఎత్తుగా లేకున్నా.. అది శిఖరాగ్రం కావడంతో ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోతాయని వివరిస్తున్నారు. అందుకే కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మరణాలు ప్రతిఏటా పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.  

ప్రధాన కారణాలివే.. 
→ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలను పక్కనపెడితే.. ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా బాధితులుగా మారుతున్నట్లు కేరళ వైద్య ఆ రోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కూడా కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.  

→ శబరియాత్ర కోసం భక్తులు రేయింబవళ్లు ప్రయాణంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాత్రంతా ప్రయాణాలు చేస్తుంటారు. భోజనం కూడా సమయానికి తీసుకోరు. సామూహికంగా వంట చేసుకున్నప్పుడో.. శాకాహార హోటళ్లు అందుబాటులో ఉన్నప్పుడో ఆహారం తీసుకుంటారు. కంటినిండా నిద్ర, కడుపునిండా భోజనం లేకపోవడంతో శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.  

→ ఇలాంటి వారిలో డీహైడ్రేషన్‌ పెరుగుతుంది. గ్లూకోజ్‌ స్థాయులు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతా యి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. 

→ ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ లభ్యత తగ్గితే.. గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.  

→ చాలామంది భక్తులు పంపా బేస్‌లోని హోటళ్లలో భోజనం చేయగానే.. కొండను అధిరోహించడం చేస్తుంటారని, ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. భోజనం తర్వాత రక్తప్రసరణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళ్తుందని, ఫలితంగా గుండెపై రెట్టింపు ఒత్తిడి ఉంటుందని పేర్కొంటున్నారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే.. రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.  

→ ఆక్సిజన్‌ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెకింగ్‌ చేసేప్పుడు డీహైడ్రేషన్‌ సంభవించడం చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు.  

– సాక్షి డిజిటల్‌ డెస్క్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement