కొచ్చి ఎయిర్‌పోర్టులో అయ్యప్పలకు ఉచిత బస | Free Ac Accommodation For Ayyappa Devotees At Kochi Airport | Sakshi
Sakshi News home page

కొచ్చి ఎయిర్‌పోర్టులో అయ్యప్పలకు ఉచిత బస

Nov 29 2025 7:58 PM | Updated on Nov 29 2025 8:35 PM

Free Ac Accommodation For Ayyappa Devotees At Kochi Airport

కొచ్చి: కొచ్చి విమానాశ్రయంలో అయ్యప్ప భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏసీ ఉచిత వసతి, స్పాట్ బుకింగ్, రవాణా సౌకర్యాలు అందిస్తున్నారు. కొచ్చి విమానాశ్రయంలో శబరిమల యాత్రికుల కోసం దేశంలోనే మొదటి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. యాత్రికులు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే శబరిమల దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

రాత్రి 8 గంటలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30కి పంబా చేరతాయి. భక్తుల కోసం మార్గమధ్యలో ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల(ఎడతవలం) వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆహారం, నీరు అందిస్తున్నారు.

కాగా, విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్‌ఇన్‌ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్‌ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది.  

తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.

శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.

 

Advertisement
 
Advertisement
Advertisement