
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నమెంట్ వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతారా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణం.
అంతేకాదు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్లను ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి. రో- కో వన్డే ప్రపంచకప్ ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.
ఆడుతూనే ఉంటాం అనే సందేశం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన తర్వాత కోహ్లి.. ‘‘మీరు ఎప్పుడైతే ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడే నిజంగా మీరు విఫలమైనట్లు’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తద్వారా తాను ఇంకొన్నాళ్లు ఆటలో కొనసాగే అవకాశం ఉందంటూ పరోక్షంగా అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు.
మరోవైపు.. 38 ఏళ్ల రోహిత్ శర్మ సైతం ఇటీవలే పది కిలోల బరువు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా చివరగా టీమిండియా తరఫున బరిలో దిగిన రో-కో.. ఆసీస్‌తో అక్టోబరు 19 నాటి తొలి వన్డేతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు
ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. రో- కో భవితవ్యంపై మరోసారి స్పందించాడు. ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం వాళ్లిద్దరు జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.
ఇద్దరూ అత్యద్భుతమైన ఆటగాళ్లు. వరల్డ్‌కప్‌నకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. యువ ఆటగాళ్లు వీరి స్థానాలను ఆక్రమిస్తారేమో.. చెప్పలేము కదా!.. లేదంటే యువ ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కదేమో!
ఏదేమైనా రోహిత్- కోహ్లి.. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. ప్రతి మ్యాచ్ తర్వాత వారి ప్రదర్శన గురించి శల్య పరీక్ష చేయడం ఉండదు. వాళ్లు ఆడటం మొదలుపెట్టిన తర్వాత పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటాం.
వరుస సెంచరీలు చేస్తే.. వరల్డ్‌కప్‌లో ఆడతారా?
కేవలం పరుగులు చేయడం కాదు.. ట్రోఫీ గెలవడం అత్యంత ముఖ్యం. ఒకవేళ ఆస్ట్రేలియాలో రోహిత్- కోహ్లి వరుసగా మూడు సెంచరీలు చేసినంత మాత్రాన.. వారు వన్డే వరల్డ్‌కప్-2027 ఆడతారనే గ్యారెంటీ లేదు కదా!..
అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే మా నిర్ణయం ఉంటుంది’’ అంటూ రోహిత్- కోహ్లిలకు మరో మెగా టోర్నీ ఆడే అవకాశం ఇవ్వకపోచ్చని అగార్కర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.
అదే సమయంలో తాము సీనియర్ ఆటగాళ్లకు అత్యంత గౌరవం ఇస్తామని.. వారితో జరిగే మా సంభాషణలు బయటకు రావు కాబట్టి బయట అందరూ ఏదో ఊహించుకుంటారని అగార్కర్ పేర్కొన్నాడు.
కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌తో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥
Rohit Sharma 🤝 Virat Kohli
🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ— BCCI (@BCCI) October 17, 2025