సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడిన జట్టునే.. రెండో వన్డేలోనూ కొసాగించింది టీమిండియా యాజమాన్యం. ఫలితంగా మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది.
సెంచరీతో అదరగొట్టాడు
ఈసారి రుతురాజ్ ఎలాంటి తప్పిదమూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్‌పూర్ మైదానంలో శతక్కొట్టిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ (Ruturaj Gaikwad)... మొత్తంగా 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు రాబట్టాడు.
సాధారణంగా రుతురాజ్ ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా ఈసారి అతడు మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గైర్హాజరీ కారణంగా రుతుకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రిషభ్ పంత్ (Rishabh Pant) నుంచి గట్టి పోటీ ఉన్నా.. యాజమాన్యం అనూహ్య రీతిలో తుదిజట్టులోనూ అతడిని ఆడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ విషయంలో మేనేజ్‌మెంట్‌కు తప్పక క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..
తిలక్, పంత్ ఉన్నా..
‘‘ఒక్క మ్యాచ్‌తో ఏ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేడు. కాబట్టే రుతురాజ్‌కు మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఇందుకు యాజమాన్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తిలక్ వర్మ , రిషభ్ పంత్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్నా రుతుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం.
అతడిని నాలుగో స్థానంలో పంపినా సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ముందు కూడా అతడిని జట్టులో కొనసాగిస్తే టాపార్డర్‌లో ఉంటాడా? లేదంటే నాలుగో స్థానంలో ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తనను ఏ స్థానంలో ఆడించినా పర్లేదనే సంకేతాన్ని రుతురాజ్ సెలక్టర్లకు ఇచ్చేశాడు. కాబట్టి మూడో వన్డేలోనూ అతడిని తప్పక కొనసాగిస్తారనే భావిస్తున్నా’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
దురదృష్టవశాత్తూ
కాగా రాంచి వేదికగా తొలి వన్డేలో రుతు 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఒట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో రుతు ఇచ్చిన క్యాచ్‌ను డెవాల్డ్ బ్రెవిస్ సంచలన రీతిలో ఒంటిచేత్తో అందుకుని.. అతడికి రీఎంట్రీలో చేదు అనుభవం మిగిల్చాడు.
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓడింది. ఫలితంగా ప్రస్తుతం 1-1తో ఇరుజట్లు సమానంగా ఉండగా.. విశాఖపట్నంలో శనివారం జరిగే మూడో వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది.
చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!


