భారతదేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే.. సగటు అభిమాని ఎగిరి గంతేయడం ఖాయం. అయితే, అందుకోసం టికెట్లు సంపాదించే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించడం విచారకరం. ఒడిషాలోని కటక్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఆల్ ఫార్మాట్ సిరీస్‌లతో బిజీ
టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత టెస్టు సిరీస్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. రాంచి వేదికగా తొలి వన్డేలో గెలిచింది. అయితే, రాయ్‌పూర్‌లో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్ 1-1తో సమం కాగా.. విశాఖపట్నంలో జరిగే మూడో వన్డేతో సిరీస్ ఫలితం తేలనుంది.
ఆఫ్‌లైన్ టికెట్ల కోసం
ఇక వన్డే సిరీస్ తర్వాత భారత్- సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో డిసెంబరు 9న జరిగే టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఆరంభంలో ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం చేపట్టగా.. త్వరితగతిన సేల్ ముగిసిపోయింది.
ఈ క్రమంలో ఆఫ్‌లైన్ టికెట్ల కోసం శుక్రవారం అభిమానులు పెద్ద ఎత్తున బారాబతి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందురోజు రాత్రి 11. 30 నిమిషాలకే కొంతమంది స్టేడియం వద్దకు చేరుకోవడం గమనార్హం.
ఏకంగా రూ. 11 వేలకు కూడా..
స్థానిక ఒడిశా టీవీ కథనం ప్రకారం.. భారత్- సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో బ్లాకులో టికెట్లు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని సుమారుగా ఆరు వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్ల విక్రయం జరిగినట్లు సమాచారం.
ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంటే.. మరోవైపు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి టికెట్ల కోసం అభిమానులు ప్రాణాలకు తెగించడం గమనార్హం. టికెట్ల కోసం స్టేడియం వద్ద పరుగులు తీస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో.. ‘‘ఇదేం పిచ్చి?.. ప్రాణాలంటే కూడా లెక్కలేదా? మ్యాచ్ చూడటం వల్ల ఒరిగే లాభం ఏమిటి?’’ అని కొంతమంది నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
బీసీసీఐ ఏం చేస్తోంది?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విధానం ప్రకారం.. వంద శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మడానికి వీలులేదు. కొద్దిమేర టికెట్లు కచ్చితంగా ఆఫ్‌లైన్‌లో విక్రయించాల్సిన పరిస్థితుల్లో కొన్ని క్రికెట్ అసోసియేషన్లు ఇందుకు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నాయి.
దీంతో తొక్కిసలాట జరిగే దుస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో వంద శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించి.. టికెట్‌తో పాటు సరైన ఐడీ ప్రూఫ్ ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!
Massive turnout at Barabati Stadium today as fans line up for India–South Africa T20 tickets.
One hopes @dcp_cuttack, @cpbbsrctc & @Satya0168 have ensured proper crowd-control arrangements, because the visuals below tell a different story--something essential is missing to keep… pic.twitter.com/heRx96QDFT— Soumyajit Pattnaik (@soumyajit) December 5, 2025


