
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో కలిసి సంజూ శాంసన్ (Sanju Samson)ను కాదని.. ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేయడం.. అదే విధంగా.. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు ఈ జట్టులో చోటివ్వడం విమర్శలకు దారితీశాయి.
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు ప్రియ శిష్యుడు గనుకే హర్షిత్ రాణాకు వరుస అవకాశాలు ఇస్తున్నారని మాజీ క్రికెటర్లు విమర్శించారు. చెన్నై దిగ్గజాలు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రధానంగా ఈ మేరకు విమర్శలు చేశారు. ఈ క్రమంలో హర్షిత్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్
ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం కుర్రాడి జీవితాన్ని నాశనం చేస్తారా?.. సిగ్గుచేటు అని మండిపడ్డాడు.
కావాలంటే తనను ఏమైనా అనొచ్చని.. కానీ 23 ఏళ్ల హర్షిత్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. అతడి తండ్రి మాజీ క్రికెటరో, సెలక్టరో కాదని.. నైపుణ్యాలతోనే అవకాశాలు దక్కించుకుంటున్నాడని గంభీర్ పేర్కొన్నాడు.
కచ్చితంగా విమర్శిస్తానంటూనే..
ఈ క్రమంలో అశ్విన్ తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశాడు. అయితే, ఈసారి అశూ మాట మార్చడం విశేషం. హర్షిత్ నైపుణ్యాలను కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. వ్యక్తిగతంగా ఎవరూ ఎవరినీ టార్గెట్ చేయవద్దంటూ హితవు పలికాడు. సోషల్ మీడియాలో ప్రతికూల విషయాలే తొందరగా వ్యాప్తి చెందుతాయని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
పగ పెట్టుకోలేదు
‘‘నేను మరోసారి చెప్తున్నా.. ఏ ఆటగాడిని వ్యక్తిగతంగా విమర్శించవద్దు. పర్సనల్ అటాక్‌కి దిగితే జానర్ మారిపోతుంది. నా కెరీర్ ఆసాంతం సంజయ్ మంజ్రేకర్ నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. అయినా సరే నేనేమీ ఆయన మీద పగ పెట్టుకోలేదు.
విమర్శలు చెప్పేది సరైంది లేదంటే తప్పు కావొచ్చు. కానీ ముందుగా చెప్పినట్లు అది వ్యక్తిగతంగా ఉండకూడదు. ఒకవేళ హర్షిత్ రాణా.. తనను ఎవరైనా కఠిన పదజాలంతో విమర్శించిన వీడియో చూస్తే అతడి పరిస్థితి ఏమై పోతుంది?
మ్యాచ్‌కు ముందు ఇలాంటివి జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది?.. ఒకవేళ అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరైనా ఈ వీడియోల గురించి తనకు చెబితే పరిస్థితి ఏంటి? ఓ ఆటగాడి నైపుణ్యాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.
దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువ
కానీ వ్యక్తిగతంగా మాత్రం వద్దు. ఇలా చేయడం ఒకటీ రెండు సార్లు బాగుంటుంది. ఆ తర్వాత పరిస్థితి గంభీరంగా మారిపోతుంది. ఈరోజుల్లో నెగటివిటీ అమ్ముడుపోయే వస్తువుగా మారిపోయింది. ఎందుకంటే దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం హర్షిత్ రాణాను అన్ని కోణాల్లో టార్గెట్ చేస్తున్న వాళ్లు.. అతడు ఒకవేళ వచ్చే ఏడాది బాగా ఆడితే.. తన నైపుణ్యాల గురించి ఇదే స్థాయిలో ప్రశంసిస్తారా? లేదంటే కేవలం ప్రతికూలతల వరకే పరిమితం అవుతారా?’’ అంటూ అశూ ఫైర్ అయ్యాడు.
హర్షిత్ నైపుణ్యాలను మాత్రమే తాను విమర్శించానంటూ పరోక్షంగా చిక్కాపైకే అంతా నెట్టేశాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లకు ముహూర్తం ఖరారైంది.