
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లను తప్పించడానికి వీరికి రోజుకో సాకు దొరుకుతుందని మండిపడ్డాడు. ఆస్ట్రేలియాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టు తనను ఆశ్చర్యపరిచిందని.. సంజూ శాంసన్ (Sanju Samson) పట్ల వివక్ష ఎందుకో అర్థం కావడం లేదని వాపోయాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా
స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య ఇరుజట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం ఇందుకు సంబంధించిన జట్లను ప్రకటించింది.
వారిద్దరు తొలిసారి..
వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసి.. శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు.. నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్‌ను తొలిసారి వన్డే జట్టుకు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు జురెల్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. సంజూ శాంసన్‌కు మాత్రం మొండిచేయి చూపారు.
అతడికి అన్యాయం
ఈ విషయంపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. ‘‘మరోసారి అతడికి అన్యాయం చేశారు. ఆఖరిగా ఆడిన వన్డేలో అతడు సెంచరీ చేశాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సంజూను తప్పక ఎంపిక చేయాల్సింది.
కానీ ఓ ఆటగాడిని తప్పించడానికి వీళ్లకు (సెలక్టర్లు) రోజుకో సాకు దొరుకుతుంది. ఓసారి అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమంటారు. మరోసారి ఓపెనర్‌గా రమ్మంటారు. ఇంకోసారి ఏడు లేదంటే ఎనిమిదో నంబర్ బ్యాటర్‌గా ఆడమంటారు.
జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?
అయినా.. అకస్మాత్తుగా ధ్రువ్ జురెల్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు?.. వన్డేల్లో సంజూ శాంసన్ కంటే అతడికి మొదటి ప్రాధాన్యం ఎలా దక్కుతుంది?.. తుదిజట్టులో సంజూ ఉన్నా, లేకపోయినా జట్టులో మాత్రం అతడికి చోటివ్వాలి కదా!
హర్షిత్ రాణా ఎందుకు?
ఇలాంటి పనులు చేయడం ద్వారా ఆటగాళ్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఒక్కోసారి యశస్వి జైస్వాల్ జట్టులో ఉంటాడు. మరోసారి అతడి పేరే కనిపించదు. అయితే, హర్షిత్ రాణా మాత్రం అన్ని జట్లలో ఉంటాడు.
అతడు జట్టులో ఎందుకు ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. ఇలా ప్రతిసారి ఒకరికి వరుస అవకాశాలు ఇస్తూ.. మరొకరిని తప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని చిక్కా సెలక్టర్ల తీరును విమర్శించాడు. కాగా ఇప్పటికే టెస్టుల్లో ఇరగదీస్తున్న జురెల్.. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు.
సౌతాఫ్రికా జట్టుపై సంజూ సెంచరీ
మరోవైపు.. సంజూ చివరగా 2023లో సౌతాఫ్రికాతో వన్డేలో 108 పరుగులు సాధించి.. టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 16 వన్డేల్లో కలిపి సగటు 56తో 99కు పైగా స్ట్రైక్‌రేటుతో 510 పరుగులు సాధించాడు. అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం అతడిని వన్డేలకు ఎంపిక చేయడం లేదు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడే జట్టులో మాత్రం ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కింది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.
చదవండి: 50 ఓవర్ల క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం