
టీమిండియా స్టార్లు సంజూ శాంసన్ (Sanju Samson), రింకూ సింగ్ (Rinku Singh)లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు వీరిద్దరు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకుని అద్భుత ప్రదర్శనలతో రాణించారంటూ కొనియాడాడు.
మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తొలుత వన్డే సిరీస్ జరుగనుండగా.. అనంతరం ఇరుజట్లు టీ20 సిరీస్‌లో పాల్గొంటాయి. ఇక ఈసారి కూడా సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌తో కలిసి.. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వన్డే టీమ్‌లోకి వచ్చాడు.
సెలక్టర్ల తీరుపై విమర్శలు
సంజూను కాదని మరీ జురెల్‌ను ఎంపిక చేయడం పట్ల టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. టీ20 జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. ఇక రింకూ సింగ్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ ఫినిషర్
ఈ నేపథ్యంలో ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ డేవిడ్ వార్నర్.. సంజూ, రింకూలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా టీ20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకునేందుకు వాళ్లిద్దరు ఎంతగానో కష్టపడ్డారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రింకూ ఐపీఎల్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటికే భారత జట్టులో ఎంతో మంది వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వారితో పాటు ఇప్పుడు ఫియర్‌లెస్ యంగ్‌స్టర్లు కూడా వచ్చేశారు. భారత క్రికెట్‌కు ఇది శుభ పరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.
మా వాళ్లకు అగ్ని పరీక్ష
ఆస్ట్రేలియన్లకు ఈ సిరీస్ అగ్ని పరీక్ష వంటిది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా టీమిండియా ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 గెలిచి జోరు మీదుంది.