చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ | IND VS AUS 1st ODI: Rohit Sharma set to achieve massive milestone | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ

Oct 16 2025 3:54 PM | Updated on Oct 16 2025 4:37 PM

IND VS AUS 1st ODI: Rohit Sharma set to achieve massive milestone

టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (వన్డేలు, టెస్ట్‌లు, టీ20లు) 500 మ్యాచ్‌ల మార్కును తాకనున్న పదో ఆటగాడిగా, నాలుగో భారతీయుడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.

అక్టోబర్‌ 19న ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే మ్యాచ్‌ (India vs Australia) రోహిత్‌కు అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్‌ అవుతుంది. ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ 42.18 సగటున, 49 సెంచరీల సాయంతో 19700 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు దిగ్గజం​ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది. సచిన్‌ మూడు ఫార్మాట్లలో 664 మ్యాచ్‌లు ఆడి 100 శతకాల సాయంతో 34357 పరుగులు చేశాడు.

సచిన్‌ తర్వాత భారత్‌ తరఫున విరాట్‌ కోహ్లి (550), ఎం​ఎస్‌ ధోని (538), రాహుల్‌ ద్రవిడ్‌ (509) మాత్రమే 500 అంతర్జాతీయ మ్యాచ్‌ల అరుదైన మైలురాయిని తాకారు.

కాగా, రోహిత్‌ శర్మ గతేడాది (2024) టీ20 ప్రపంచకప్‌ గెలిచాక పొట్టి ఫార్మాట్‌కు, ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్‌ చివరిగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహించిన హిట్‌మ్యాన్‌ టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.

రోహిత్‌ 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు వన్డేలు ఆడాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. ఇందులో భాగంగా భారీగా బరువు తగ్గి, కెరీర్‌ తొలినాళ్లలో రోహిత్‌ను గుర్తు చేస్తున్నాడు. వన్డేల్లో రోహిత్‌ భవితవ్యం ఆసీస్‌ పర్యటనలో ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటనలో రాణిస్తే హిట్‌మ్యాన్‌ను తిరుగుండదు.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్‌పై హిట్‌మ్యాన్‌ను అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ జట్టుపై అతను 46 ఇన్నింగ్స్‌ల్లో 57.3 సగటున 2407 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 9 అర్ద సెంచరీలు ఉన్నాయి.

అభిమానులు రోహిత్‌ నుంచి మరోసారి ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఫ్యాన్స్‌ కోరికల అనుగుణంగానే హిట్‌మ్యాన్‌ కూడా కఠోరంగా శ్రమిస్తున్నాడు. నిన్న పెర్త్‌లో ల్యాండ్‌ అయిన వెంటనే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. విరాట్‌ కోహ్లితో కలిసి గంటల కొద్ది నెట్స్‌లో చమటోడ్చాడు.

చదవండి: హర్భజన్ సింగ్ రీఎంట్రీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement