వడోదర: ఇరవై రోజులుగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ ‘ప్లేఆఫ్స్’ రేస్ మజిలీకి చేరింది. ఐదు జట్లలో ఒక్క రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి పది రోజుల క్రితమే అందలమెక్కిన ఆర్‌సీబీ... నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని మాత్రం అందిపుచ్చుకునేందుకు ఆపసోపాలు పడుతోంది.
ఇటీవల ఢిల్లీ, ముంబై జట్లతో జరిగిన వరుస మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడింది. ఇప్పుడు ఆర్‌సీబీకి మిగిలింది ఆఖరి మ్యాచ్. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగే ఈ పోరులో గెలిస్తే లీగ్ నిబంధనల ప్రకారం ‘టాప్’లో నిలిచి ఆర్‌సీబీ టీమ్ నేరుగా టైటిల్ వేటలో నిలుస్తుంది. అలాగని ఓడితే అగ్రస్థానం ఉన్నపళంగా చేజారదు.
ఎందుకంటే పట్టికలో బెంగళూరు సరసన 10 పాయింట్లు నెగ్గే అర్హత ఒక్క గుజరాత్ జెయింట్స్‌కే ఉంది. కానీ ఈ జట్టు రన్‌రేట్‌లో చాలా వెనుకబడి ఉంది. ఇక ప్రస్తుత మ్యాచ్ యూపీ వారియర్స్‌కే అత్యంత కీలకం. ఇందులో ఓడిపోతే ఇంకో మ్యాచ్ ఉన్నప్పటికీ యూపీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. రాత్రి 7:30 గంటల నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్ , ‘జియో హాట్‌స్టార్’లో ప్రత్యక్ష ప్రసారం


