టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వరుణ్.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో స్పిన్ దళానికి నాయకుడిగా ఉంటాడని పేర్కొన్నాడు. మంచు ప్రభావం అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపబోదని.. తడిచిన బంతితోనూ వరుణ్ (Varun Chakravarthy) అనుకున్న ఫలితం రాబట్టలగడని పేర్కొన్నాడు.
మంచు ప్రభావం
భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు జరుగనుంది. ఇందుకు ఆఖరి సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీగా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 3-0తో గెలిచి.. సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మూడు మ్యాచ్‌లలోనూ మంచు ప్రభావం కనిపించింది.
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటుతారని.. తేమ ప్రభావం వల్ల మనవాళ్లకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు.
స్పిన్నర్లకు కష్టమే.. కానీ
జియోహాట్‌స్టార్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో వరల్డ్‌కప్ జరగనుంది. రాత్రి పూట మంచు ప్రభావం ఉండటం సహజం. కాబట్టి.. తడిసిన బంతితో బౌలింగ్ చేయడం స్పిన్నర్లకు కష్టమే.
అయితే భారత స్పిన్నర్లకు ఇది పెద్ద ఇబ్బందేం కాకపోవచ్చు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు ఆడాడు. తడిచిన బంతితోనూ ప్రభావం చూపగల సత్తా అతడికి ఉంది. అక్షర్ పటేల్‌కు కూడా ఇదేమీ పెద్ద కష్టం కాబోదు.
కుల్దీప్ ఇబ్బంది పడే అవకాశం
అయితే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం.. తన బౌలింగ్ శైలి కారణంగా తేమ కారణంగా కాస్త ఇబ్బంది పడవచ్చు. అయినా పరిస్థితులకు తగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలో కుల్దీప్‌నకు తెలుసు’ అని కుంబ్లే అన్నాడు.
టీమిండియాకు ఆ సత్తా ఉంది
అదే విధంగా.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా... వరల్డ్‌కప్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలవడం అంత సులువైన విషయం కాదు.
ఇప్పటి వరకు ఏ జట్టూ ఆ ఫీట్ నమోదు చేయలేదు. అయితే టీమిండియాకు ఆ సత్తా ఉంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్... ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేంత బలంగా ఉంది’’ అని కుంబ్లే పేర్కొన్నాడు.


