పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై ఐస్‌లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే రీతిలో పీసీబీ నాన్చుడు వ్యవహారానికి కౌంటర్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే విషయంపై త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని.. అదే సమయంలో తమను దృష్టిలో పెట్టుకోవాలంటూ సెటైరికల్‌గా విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్ అవుట్
అసలేం జరిగిందంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదంటూ.. తమ వేదికను మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ పంతం పట్టింది. ఇందుకు నిరాకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించి.. ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది.
ఇక బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఓటు వేసిన పాక్ బోర్డు.. తాము కూడా టోర్నీ నుంచి వైదొలుతామని బెదిరింపు ధోరణి అవలంబించింది. ఇప్పటికే పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లా కోసమంటూ పీసీబీ అతి చేస్తోంది. ఒకవేళ పాక్ ఇలాగే ఓవరాక్షన్ చేస్తే.. ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
పీసీబీ మేకపోతు గాంభీర్యం
అందుకే ఫిబ్రవరి 2 వరకు తమ నిర్ణయం చెబుతామంటూ పీసీబీ మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ సెటైరికల్ ట్వీట్‌తో ముందుకు వచ్చింది.
ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ వైరల్
‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటారా? లేదా? అన్న అంశంపై పాకిస్తాన్ ఫిబ్రవరి 2 వరకు నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదు. నిజంగా ఇది చాలా అన్యాయం. ఇందులో దాచడానికి ఇంకేముంది. ఇంకా రహస్యంగా ఉంచడం సబబేనా? మా జట్టుకు పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు.
ఒకవేళ మీరు ఇప్పటికే నిర్ణయం చెప్పి ఉంటే.. మా జట్టు పూర్తిస్థాయిలో సన్నాహకాలు మొదలుపెట్టేది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శ్రమించేది. అసలే మా కెప్టెన్ ప్రొఫెషనల్ బేకర్’’ అని ఐస్‌లాండ్ క్రికెట్ పీసీబీని టీజ్ చేసింది.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం ఐస్‌లాండ్ క్రికెట్‌కు ఇలాంటి పోస్టులు తప్ప ఆట చేతకాదంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం
ఇందుకు బదులుగా తమ కెప్టెన్ ‘బేకర్’ అని.. తమ జట్టు హెడ్‌కోచ్ స్టార్టప్‌లలో ఇన్వెస్టర్ అని.. అదే విధంగా తమ చైర్మన్ షిప్ కెప్టెన్ అని.. తమ జట్టులో భిన్నత్వంలో ఏకత్వం ఉందని కౌంటర్ ఇచ్చింది.
అదే జరిగితే పాకిస్తాన్ స్థానంలో ఉగాండా
ఇక టీమిండియా అభిమానులు మాత్రం ఐస్‌లాండ్ క్రికెట్‌కు మద్దతుగా.. ‘‘పాక్ కచ్చితంగా టోర్నీలో ఆడుతుంది. లేదంటే వాళ్లకు ఆర్థికంగా కష్టాలు తప్పవు. పాక్ క్రికెట్ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడుతుంది. ఇదంతా తెలిసినా కూడా తమ గురించి చర్చ జరగాలనే ఉద్దేశంతోనే పీసీబీ ఇలా నాటకాలు ఆడుతోంది’’ అని ఏకిపారేస్తున్నారు.
కాగా ఒకవేళ పాక్ తప్పుకొన్నా.. ర్యాంకింగ్ ఆధారంగా ఉగాండా ఆ జట్టును భర్తీ చేస్తుంది. ఐస్‌లాండ్ క్రికెట్ అసలు ఐసీసీలో సభ్యదేశమే కాదు. అయితే, ఫన్నీ, సెటైరికల్ ట్వీట్లతో ఇలా అలరిస్తూ ఉంటుంది.


