టీమిండియా ఆటగాళ్ల దూకుడు | Suryakumar Yadav Back In Top 10, Abhishek Sharma Retains 1st Spot In ICC T20 Batting Rankings, More Details Inside | Sakshi
Sakshi News home page

ICC Batting Rankings: టీమిండియా ఆటగాళ్ల దూకుడు

Jan 28 2026 4:02 PM | Updated on Jan 28 2026 4:16 PM

Suryakumar Yadav back in top 10, Abhishek Sharma retains 1st spot in ICC T20 rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా బ్యాటర్లు భారీ ఎత్తున లాభపడ్డారు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో అద్భుత ప్రదర్శనలు చేసిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. స్కై 717 రేటింగ్‌ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు. 

కొంతకాలంగా అగ్రపీఠంపై తీష్ట వేసిన విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ రేటింగ్‌ పాయింట్లను మరింత పెంచుకొని, ఎవరికీ అందని ఎత్తుకు ఎదుగుతున్నాడు. అభిషేక్‌ ప్రస్తుతం 929 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా 2, శివమ్‌ దూబే 9, రింకూ సింగ్‌ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 53, 59, 68 స్థానాలకు ఎగబాకారు. గాయం​ కారణంగా న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్నా తిలక్‌ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు.

మిగతా దేశాలకు చెందిన బ్యాటర్లలో మార్క్రమ్‌  (9 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి), బ్రాండన్‌ కింగ్‌ (15 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి), గ్లెన్‌ ఫిలిప్స్‌ (18 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి), సెదిఖుల్లా అటల్‌ (13 స్థానాలు ఎగబాకి 65), ర్యాన్‌ రికెల్టన్‌ (12 స్థానాలు ఎగబాకి 82), దర్విష్‌ రసూల్‌ (29 స్థానాలు ఎగబాకి 88), హెట్‌మైర్‌ (27 స్థానాలు ఎగబాకి 93) భారీగా లబ్ది పొందారు.

బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13కు, రవి బిష్ణోయ్‌ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్దిక్‌ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ స్థానానికి చేరారు. వరుణ్‌ చక్రవర్తి మినహా టాప్‌-10లో మరో భారత బౌలర్‌ లేడు. రషీద్‌ ఖాన్‌, హసరంగ 2,3 స్థానాలు నిలబెట్టుకున్నారు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 16, కుల్దీప్‌ యాదవ్‌ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే ఒకటి, 6 స్థానాలు మెరుగుపర్చుకొని 3, 12 స్థానాలకు ఎగబాకారు. టాప్‌-2గా సికందర్‌ రజా, సైమ్‌ అయూబ్‌ కొనసాగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement