వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో డారిల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
సీఫర్ట్, కాన్వే ధాటికి న్యూజిలాండ్ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడిగా రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు.
వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్ మధ్యలో కాస్త తడబడింది. రచిన్ రవీంద్ర (2), మార్క్ చాప్‌మన్ (9) త్వరితగతిన ఔటయ్యారు. ఈ మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ బ్యాట్ ఝులిపించడంతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్కును దాటింది.
సాంట్నర్ (11), ఫౌల్క్స్ (13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్‌ను హార్దిక్ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. మిచెల్‌తో పాటు మ్యాట్ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-2), కుల్దీప్ యాదవ్ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.


