2025లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్‌ హీరోలు వీరే! | Tollywood Star heroes miss 2025 year | Sakshi
Sakshi News home page

2025లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్‌ హీరోలు వీరే!

Aug 31 2025 1:39 AM | Updated on Aug 31 2025 10:07 AM

Tollywood Star heroes miss 2025 year

గతంలో హీరోలు వరుసగా సినిమాలు చేసేవారు. ఏడాదికి రెండు మూడు లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దాదాపు చాలామంది హీరోల నుంచి వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాని ఆడియన్స్‌ ముందుకి తీసుకొచ్చే వాళ్లను వేళ్లల్లో లెక్కపెట్టొచ్చు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు.

లేట్‌ అయినా భారీ హిట్‌ ఇవ్వాలనే ఆలోచనలతో ఇటు హీరోలు, అటు దర్శక–నిర్మాతలు కథ, షూటింగ్, క్వాలిటీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం బాగా సమయం తీసుకుని, ఆచి తూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా షూటింగ్, పోస్ట్‌  ప్రోడక్షన్‌కే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నిఖిల్, వరుణ్‌ తేజ్, శర్వానంద్‌... ఇలా పలువురు హీరోలు 2025ని మిస్‌ అవుతున్నారు. ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా 2025ని మిస్‌ అవుతున్న కథానాయకులెవరో చూద్దాం.  

రెండేళ్లుగా వెయిటింగ్‌ 
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్‌ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు రెండేళ్లకు పైగా వెయిటింగ్‌లో ఉన్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేష న్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్‌ ఉప్పల పాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించారు.

ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. అందుకు తగ్గట్టే షూటింగ్‌ కూడా శరవేగంగా జరిగింది. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం కోసం ‘విశ్వంభర’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్‌. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై రకరకాల వార్తలొచ్చాయి. కానీ, ఈ ఏడాది కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్‌ కారణంగా ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్  గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని  2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2024, 2025ని మిస్‌ అయ్యారు చిరంజీవి. అయితే వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపించి, అలరించనున్నారు.

సోలో హీరోగా గ్యాప్‌ 
టాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌ సీనియర్‌ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన సోలో హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘నా సామిరంగ’. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ ‘కుబేర, కూలీ’ సినిమాల ద్వారా తమిళ–తెలుగు ప్రేక్షకులను పలకరించారాయన. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలో ధనుష్‌తో కలిసి స్క్రీన్‌ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా జూన్‌ 20న విడుదలైంది.

అలాగే రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ‘కూలీ’ సినిమాలో విలన్‌ పాత్రలో మెప్పించారు నాగార్జున. ప్రతి నాయకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. ఇక నాగార్జున సోలో హీరోగా రూపొందనున్న వందో చిత్రానికి తమిళ డైరెక్టర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించనున్నారు. తన కెరీర్‌లోని ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మించనున్నారు నాగార్జున.

ఈ  ప్రాజెక్ట్‌ ఇప్పటికే లాక్‌ అయింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఎలాంటి అప్‌డేట్‌ లేక పోవడంతో వారు నిరాశ చెందారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లినా విడుదలయ్యేది మాత్రం 2026లోనే. ఆ రకంగా సోలో హీరోగా 2025ని నాగార్జున కూడా మిస్‌ అయినట్టే.  

అభిమానులకు నిరాశే 
వరుస పాన్‌ ఇండియా చిత్రాలతో ఫుల్‌ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రభాస్‌ సోలో హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 2024 జూన్‌ 27న విడుదలైంది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూ  పొందుతోన్న సినిమా ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో రూ  పొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని డిసెంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టాకీ పార్ట్‌ పూర్తయినా కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉండటం, వీఎఫ్‌ఎక్స్‌ వల్ల డిసెంబరు 5న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయలేక పోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ అభిమానులు నిరాశపడ్డారు. ‘‘ది రాజా సాబ్‌’ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

తెలుగు బిజినెస్‌ సర్కిల్‌ వారు కూడా ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. కానీ, హిందీ ఆడియ న్స్  మాత్రం డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేయాలని కోరుతున్నారు’’ అంటూ టీజీ విశ్వప్రసాద్‌ తెలి పారు. అయితే తెలుగువారికి పెద్ద పండగైన సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రకంగా సోలో హీరోగా 2025ని ప్రభాస్‌ మిస్‌ అయినట్టే. అయితే విష్ణు మంచు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్‌ అతిథి పాత్రలో కనిపించి, అలరించారు. ఈ చిత్రం జూన్‌ 27న విడుదలైంది.

నిరీక్షణ తప్పదు 
మహేశ్‌బాబు హీరోగా రూ  పొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ కమిట్‌ అయ్యారు మహేశ్‌. ఈ సినిమాలో ప్రియాంకా చో్ర పా, హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు మహేశ్‌. ఇందుకోసం పొడవాటి జుట్టు, గడ్డంతో మేకోవర్‌ అయ్యారాయన. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జో న్స్  స్టైల్‌ కథతో ఈ సినిమా రూ  పొందుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకు పైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్‌  ప్రోడక్షన్‌కి కూడా ఎక్కువ టైమ్‌ తీసుకుంటారాయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే 2025 కాదు... 2026ని కూడా మహేశ్‌ మిస్‌ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు.  

రెండేళ్లు గ్యాప్‌? 
ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్‌ 1’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌ నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘కేజీఎఫ్, సలార్‌’ చిత్రాల ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘డ్రాగ న్  ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే రిలీజ్‌ డేట్‌లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్‌ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే.

అంటే... సోలో హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్‌ వచ్చినట్లు అవుతుంది ఎన్టీఆర్‌కి. ఇదిలా ఉంటే... హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ నటించిన హిందీ చిత్రం ‘వార్‌ 2’. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల అయింది. అయితే ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా 2025లో రిలీజ్‌ కాలేదు.. అలా ఈ ఏడాదిని ఆయన మిస్‌ అయినట్లే అని చె ప్పాచ్చు.  

గ్యాప్‌ ఇవ్వలేదు... వచ్చింది  
‘గ్యాప్‌ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో అల్లు అర్జున్‌ ఓ డైలాగ్‌ చెబుతారు. అలా ‘పుష్ప 1, 2’ సినిమాల తర్వాత ఆయనకు 2025లో గ్యాప్‌ వచ్చినట్లే. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్‌’, ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను అలరించారు హీరో అల్లు అర్జున్‌. ‘పుష్ప: ది రూల్‌’ 2024 డిసెంబరు 5న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూ పాయల వసూళ్లు సాధించింది.

ఆ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్‌ అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్‌. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌  హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యారు. కళానిధి మార న్   సమర్పణలో సన్‌పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.

‘అవతార్‌’, ‘డ్యూన్‌’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్‌ మాబ్‌ సీన్‌ అనే ప్రముఖ టెక్నికల్‌ టీమ్‌ ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘పుష్ప: ది రూల్‌’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఏఏ22 ఏ6’ చిత్రం 2026 చివర లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా 2025ని అల్లు అర్జున్‌ కూడా మిస్‌ అయ్యారు.  

ఇంకా... 
అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెని న్  ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్‌ నటించిన చివరి చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్‌ 28న విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘లెనిన్‌’. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వరుసగా 2024, 2025ని అఖిల్‌ మిస్సయ్యారు.  

వరుణ్‌ తేజ్‌ హీరోగా రూ  పొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌). మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్‌ కథానాయికగా నటిస్తున్నారు. యువీ క్రియేష న్స్ , ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టై న్  మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 14న ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వరుణ్‌. తాజాగా ఆయన నటిస్తున్న ‘వీటీ 15’ సినిమా ఈ ఏడాది నవంబరులో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్‌ కానుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. దీంతో వరుణ్‌ తేజ్‌ కూడా 2025ని మిస్‌ అయినట్లే.  

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు. నిఖిల్‌ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గత ఏడాది నవంబరు 8న విడుదలైంది. సో... ‘స్వయంభు’ 2026లో రిలీజ్‌ కానుండటంతో 2025ని నిఖిల్‌ మిస్సయ్యారని చెప్పాచ్చు. 

శర్వానంద్‌ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్‌ 7న విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’ ఒకటి. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టై న్  మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉన్నా రిలీజ్‌ డేట్‌పై స్పష్టత లేదు. అదే విధంగా శర్వానంద్, మాళవికా నాయర్‌ జోడీగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్‌ టైటిల్‌). అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేవు. ఈ కారణంగా శర్వానంద్‌ కూడా 2025ని మిస్‌ అయినట్లే. 

పైన చెప్పిన హీరోలే కాదు. ఇంకా పలువురు కథానాయకులు 2025ని మిస్‌ అయ్యారు. 2025ని మిస్‌ అయినప్పటికీ 2026లో మాత్రం తమ జోరు చూపిస్తామంటున్నారు. – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement