హీరో విజయ్‌కు తాను సలహాలిచ్చే స్థితిలో లేనంటున్నారు హీరో, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. అనుభవమే అన్నీ నేర్పుతుందంటున్నారు. కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్‌కు కమల్ హాసన్, మంజువారియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్‌లకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
అదే నా శత్రువు
తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. అధికార డీఎమ్‌కే పార్టీయే తమ రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మరి మీరు ఎవర్ని ప్రత్యర్థి/ శత్రువుగా భావిస్తున్నారు? అని అడిగారు. అందుకు కమల్.. నాకు పార్టీల కన్నా పెద్ద శత్రువు కులతత్వం. దాన్ని అంతమొందించడమే నా ప్రధాన లక్ష్యం. కులమే నాకు పెద్ద శత్రువు అని బదులిచ్చారు.
అదే గొప్ప గురువు
2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ (Vijay)కు ఏమైనా సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు నేను సలహాలిచ్చే స్థాయిలో లేను. నా సోదరుడు విజయ్‌కు సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు. మనుషులు పక్షపాతంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు.
సినిమా
అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నారు. మొత్తానికి విజయ్‌తో శత్రుత్వం లేదని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ (Kamal Haasan) చివరగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో కనిపించారు. విజయ్ విషయానికి వస్తే ఆయన గతేడాది గోట్ మూవీతో పలకరించారు. తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన జన నాయగన్ 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.


