విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు.
మొదట్లో కాదన్నారు.. కానీ!
అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్‌ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో..
ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి.


