నటీనటులు చాలావరకు కుదిరితే సినిమాలు లేదంటే ఏవో బిజినెస్‌లు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం కాస్త భిన్నమైన దారిలో వెళ్తుంటారు. అలాంటి వారిలో నటి ప్రగతి ఒకరు. తల్లి, అక్క, పిన్ని తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత రెండు మూడేళ్ల నుంచి మూవీస్ చేయడం చాలావరకు తగ్గించేసింది. దానికి కారణం పవర్ లిఫ్టింగ్. లాక్‌డౌన్ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన ఈమె.. పవర్ లిఫ్టింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)
ఎంతలా అంటే గతేడాది జరిగిన సౌతిండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి పతకం సాధించింది. ఈ ఏడాది కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు, రెండు వెండి పతకాలు సాధించి చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా భారత తరఫున త్వరలో జరగబోయే పోటీల్లో పాల్గొనబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రగతినే వెల్లడించింది. భారత జెర్సీ ధరించి, ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నెల్లూరులోని ఉలవపాడు ప్రగతి సొంతూరు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి చెన్నై వెళ్లిపోయింది. కార్టూన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పడంతో కెరీర్ మొదలుపెట్టింది. తమిళ దర్శకుడు భాగ్యరాజీ 'వీట్ల విశేషంగా' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. తర్వాత ఒకటి రెండు మూవీస్‌లో హీరోయిన్‌గా కనిపించింది. అనంతరం పెళ్లి జరగడంతో కొన్నాళ్లకు నటనకు గ్యాప్ ఇచ్చింది. రీఎంట్రీలో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమె.. ఎఫ్ 2, ఎఫ్ 3, జులాయి, చిరుత, రెడీ, గంగోత్రి, నువ్వే నువ్వే, దూకుడు తదితర చిత్రాల్లో నటించింది.
(ఇదీ చదవండి: నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్)


