
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బైసన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా వస్తోన్న బైసన్ మూవీ తెలుగులోనూ రిలీజవుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం బైసన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన తన మూవీ పరదా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తెలుగులో తాను నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని తెలిపింది. ఇలాంటి ఫలితం తాను ఊహించలేదని వెల్లడించింది. పరదా మూవీ రెస్పాన్స్ చూసి చాలా బాధపడ్డానని పేర్కొంది. ఈ ఏడాది తాను నటించిన ప్రాజెక్టులు ఆశించిన విజయాన్ని సాధించలేదన్నారు. ఈ విషయాన్ని అంగీకరించక తప్పడం లేదని వివరించింది. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
అనుపమ మాట్లాడుతూ..'మనం చేసే ప్రతి చిత్రానికి అది బాగానే వస్తుందని అనుకుంటాం. ప్రేక్షకులందరూ మన సినిమా ఇష్టపడతారని ఆశిస్తున్నాం. అది తప్పనిసరిగా బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినా.. నేను ప్రతి చిత్రంలో విభిన్న పాత్రలను పోషించడానికి ప్రయత్నిస్తున్నా. కిష్కింధపురి పాత్ర.. బైసన్ రోల్ ఒకటి కాదు. ఏదైనా నా సినిమా విజయం సాధించినప్పుడు.. మంచి సినిమాలు చేయడానికి.. స్క్రిప్ట్‌లను తెలివిగా ఎంచుకోవడానికి తోడ్పడుతుంది' అని పంచుకుంది. కాగా.. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన పరదా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని ఈ సినిమాకు..ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. చాలా కాలంగా ఉన్న ఆచారంలో భాగంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఓ గ్రామానికి చెందిన యువతి కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.