దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు బండి సరోజ్ కుమార్. ప్రస్తుతం ఈయన మోగ్లీ మూవీలో కీలక పాత్రలో నటించాడు. యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా బండి సరోజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఎవరితో టచ్‌లో లేను
ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. మాది మధ్యతరగతి కుటుంబం. కానీ, చిన్నప్పటినుంచే నేను చాలా ధనవంతుడిని అని ఫీలయ్యేవాడిని. మా అమ్మ స్కూల్‌కి వస్తే కూడా పక్కింటావిడ అని చెప్పేవాడిని. డబ్బుల గురించి కాదు కానీ ఎప్పుడూ అందరికంటే పైన ఉండాలని ఆశపడేవాడిని. అమ్మానాన్నకు టచ్‌లో లేను. వాళ్ల ఫోటో కూడా నా దగ్గర లేదు.
భార్యాబిడ్డకు దూరం
అందరికంటే నేను తేడాగా ఎందుకున్నానని ఆలోచించాను. మామూలుగా ఉండాలని ప్రయత్నించాను. సీరియస్‌గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత ఈ జీవితమంతా ఫేక్ అనిపించింది. నా భార్య ఏడాది వయసున్న నా కొడుకును తీసుకొచ్చి చూపిస్తే నాలో ఎటువంటి చలనం లేదు. అంటే నాకు కడుపు తీపి లేదు. కొడుకుని చూసి పదేళ్లవుతోంది. వాళ్లందరికీ దూరంగా ఉన్నాను.
సిగరెట్లు మానేశా..
నాకు కేవలం సినిమాలపైనే ఆసక్తి ఉంది. దేనిపైనా నాకు వ్యామోహం లేదు. అంతకుముందు అమ్మాయిలను ఇంటికి పిలిచేవాడిని. కానీ, ఏడాదికాలంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. అప్పట్లో వెయ్యికి పైగా సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు పూర్తిగా మానేశాను. కాకపోతే మోగ్లీ సినిమాలో మాత్రం సిగరెట్లు తాగుతూ కనిపిస్తాను అని బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) చెప్పుకొచ్చాడు.
సినిమా
బండి సరోజ్ కుమార్ నిర్బంధం, నిర్బంధం 2, మాంగళ్యం, పరాక్రమం సినిమాల్లో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించాడు. పోర్‌కాలం, అస్తమానం అనే తమిళ సినిమాలకు దర్శకరచయితగానూ పని చేశాడు.


