బాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్’. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్ తెరకెక్కించారు. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్‌కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్‌ని రాబట్టి.. హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్‌వీర్ సింగ్ ఖాతాలో హిట్ పడిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే.. వీకెండ్‌లోగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్‌వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు.


