అలా పెళ్లయిదో లేదో ఇలా వెకేషన్ చెక్కేశాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. హరణ్యతో ఇటీవలే (నవంబర్ 27న) అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో క్రికెటర్స్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా భార్యతో కలిసి హనీమూన్ వెళ్లిపోయాడు రాహుల్.
వెకేషన్‌లో కొత్త జంట
మాల్దీవుల్లో కొత్త దంపతులు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లయిన వారానికే హనీమూన్ వెళ్లిపోయి ఏకాంతంగా సేద తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు దంపతులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రాహుల్ నేపథ్యం
రాహుల్ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్‌లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.


