అందం, టాలెంట్ ఉంటే సరిపోదు కూసింత అదృష్టం కూడా ఉండాలి. పాయల్ రాజ్‌పుత్‌కు లక్ మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. నేడు (డిసెంబర్ 5) పాయల్ రాజ్‌పుత్ 33వ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
సీరియల్ నటిగా..
1992 డిసెంబర్ 5న ఢిల్లీలో పాయల్ జన్మించింది. చిన్ననాటి నుంచే సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉంది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమె ఇష్టాన్ని కాదనుకుండా నచ్చింది చేయమని ప్రోత్సహించారు. అలా సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. 2010 నుంచి ఏడేళ్లపాటు హిందీలో పలు సీరియల్స్ చేసింది. చన్నా మేరేయా (2018) అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్‌గా మారింది.

ఫస్ట్ మూవీతో క్రేజ్
ఈ మూవీలో పాయల్‌ను చూసిన తెలుగు దర్శకుడు అజయ్ భూపతి ఫిదా అయ్యాడు. అలా ఆర్‌ఎక్స్ 100 మూవీతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్‌డీఎక్స్ లవ్, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్‌మార్‌ఖాన్ వంటి సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు.
కెరీర్
అలాంటి సమయంలో అజయ్ భూపతి మంగళవారం సినిమాతో తనకు ఘన విజయాన్ని అందించాడు. ఈ హిట్టు తనను మళ్లీ నిలబెట్టేలా చేసింది. మరో కమర్షియల్ హిట్టు పడితేనే పాయల్ (Payal Rajput) కెరీర్ పుంజుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలు చేస్తోంది. మరి మున్ముందైనా మంచి సక్సెస్ వస్తుందేమో చూడాలి!


